ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడపగడపకు చేరేలా అహర్నిశలు కృషి చేస్తున్నట్టు సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. స్థానిక పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎస్పీ భాస్కరన్, అదనపు కలెక్టర్ పద్మజ రాణితో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందచేశారు. వివిధ శాఖలచే ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు.
జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా ఈ సంవత్సరం యాసంగిలో 2 లక్షల 85 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసినట్టు వెల్లడించారు. రైతు బందు పథకం ద్వారా 2.40 లక్షల మందికి రెండు పంటలకు రూ.608 కోట్లు వ్యవసాయ పెట్టుబడి సహాయం అందించినట్టు తెలిపారు. రూ.5 లక్షల చొప్పున రైతుబీమా ద్వారా 1,502 మంది రైతుల నామినీలకు రూ.75.10 కోట్లు చెల్లించినట్టు వివరించారు. సంక్షేమ పథకాల అమలుతో జిల్లాను ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి జ్యోతిర్మయి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి అరుదైన గౌరవం