Suryapet Students Stuck in Ukraine : 'సార్.. ఇక్కడ తిండి, నీరు దొరకడం లేదు. ఏటీఎంలలో డబ్బులు లేవు.. అక్కడి నుంచి మా తల్లిదండ్రులు డబ్బులు పంపినా తీసుకునే పరిస్థితి లేదు. కీవ్‌లోని మా యూనివర్సిటీ వసతి గృహం వద్ద బంకర్‌లో తలదాచుకుంటున్నాం.. బాంబుల మోత.. పొగలు కమ్ముకుంటున్నాయి.. భారత రాయబార కార్యాలయం వారు ఫోన్లు చేస్తే స్పందించడం లేదు.. ట్వీట్‌లకు మాత్రం సమాధానమిస్తున్నారు. త్వరలో విమానం ఏర్పాటు చేస్తాం.. భారత్‌కు పంపిస్తామంటున్నారు.. భయం.. భయంగా ఉంది.. అంటూ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న నకిరేకల్‌కు చెందిన వైద్య విద్యార్థి రాసమళ్ల శరత్ ఆవేదన వ్యక్తం చేశారు. శరత్ ఉక్రెయిన్‌లో వైద్య విద్య మూడో సంవత్సరం చదువుతున్నారు. నకిరేకల్‌లో శరత్ తల్లిదండ్రులు సైదులు, లక్ష్మిల ఇంటికి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. శరత్‌తో వీడియో కాల్‌లో వీరేశం మాట్లాడారు. తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఇదీ చదవండి: Telugu Students in Ukraine : 'బాంబుల మోతతో మా ప్రాంతం దద్దరిల్లుతోంది'
నకిరేకల్ నుంచి నలుగురు..
Nakrekal students in Ukraine : నకిరేకల్ నుంచి నలుగురు విద్యార్థులు ఉక్రెయిన్‌లోని కీవ్ వైద్య కశాలలో చదువుతున్నారు. వీరిలో శరత్ ఒక్కరే అక్కడ చిక్కుకున్నారు. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న చింతోజు హారిక, సాయి, లోకేశ్ కొద్దిరోజుల క్రితమే ఇక్కడికి వచ్చారు. తల్లిదండ్రులు అప్రమత్తం చేయడం, ఆన్‌లైన్ తరగతులకు అనుమతి లభించడంతో పది రోజుల క్రితమే నకిరేకల్ వచ్చేశానని చింతోజు హారిక వివరించారు.
తిప్పర్తి:
Thipparthi students in Ukraine : తిప్పర్తికి చెందిన గోలి జాన్సన్, గోలి రాజకుమారి ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. శుక్రవారం వారు తిప్పర్తిలో ఉంటున్న తమ తల్లి నిరీక్షణతో ఫోన్‌లో మాట్లాడారు. వారు ఉంటున్న నివాసాలకు సమీపంలో బాంబులు పడ్డట్లు చెప్పారు. అక్కడికి భారత రాయభారి వచ్చి వివరాలు తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే భారతదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు భారత రాయభారి వారికి చెప్పినట్లు తల్లికి వివరించారు. యుద్ధం నేపథ్యంలో భయపడొద్దని ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని తమ కుమారుడు, కూతురికి తల్లి నిరీక్షణ సూచించారు. ఇదీ చదవండి: Telugu Students in Ukraine : 'కళ్లుమూస్తే బతికుంటామో లేదోనని భయమేస్తోందమ్మా..'
ఇదీ చదవండి: Telugu Students in Ukraine : 'నాన్నా.. మిమ్మల్ని చూడకుండానే చనిపోతానేమోనని భయమేస్తోంది'