హుజూర్నగర్ ఉపఎన్నికల వేళ... సూర్యాపేట జిల్లా పోలీస్ బాస్‌పై వేటు పడింది. ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లును విధుల నుంచి తప్పిస్తూ... కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఆయన స్థానంలో ఆర్. భాస్కరన్... విధులు నిర్వహించనున్నారు. అధికార పార్టీకి ఎస్పీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ.. ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే ఎస్పీని బదిలీ చేయాలని డిమాండ్ చేశాయి. తన సతీమణి బరిలో నిలిచిన హుజూర్‌నగర్‌లో ఎన్నికలు సజావుగా సాగాలంటే జిల్లా పోలీసు ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని... టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈసీని కోరారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సైతం ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై ఈసీ... డీజీపీని నివేదిక కోరింది. ఫిర్యాదు అంశాలు నిజమేనని డీజీపీ ఇచ్చిన నివేదికలో తేలినట్లు సమాచారం.
హైదరాబాద్ రేంజ్ ఐజీ చేతిలో ఎన్నికల బాధ్యతలు...
రాష్ట్ర డీజీపీతో పాటు సూర్యాపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అమయ్ కుమార్‌ను సైతం... ఎస్పీ తీరుపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యాపేట జిల్లా ఎన్నికల బాధ్యతలను... హైదరాబాద్ రేంజ్ ఐజీ పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. ఎస్పీపై విపక్షాల ఆరోపణలకు బలం చేకూరినట్లు... కలెక్టర్ నివేదికలో సైతం ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాల దృష్ట్యా ఎస్పీ వెంకటేశ్వర్లుపై... ఉన్నపళంగా వేటు పడింది. హైదరాబాదులోని పోలీసు ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేయటంతోపాటు... ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఆదేశాల్లో పేర్కొంది.
ఎస్పీ వెంకటేశ్వర్లును ఈసీ బదిలీ చేయటం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. జిల్లా స్థాయి పోలీసు అధికారిని బదిలీ చేయడాన్ని కాంగ్రెస్ స్వాగతించింది.
ఇవీ చూడండి: నేటి నుంచి ఆర్టీసీ సమ్మె... ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రభుత్వం!