తొమ్మిది పదుల వయసులో పొట్టకూటి కోసం బుట్టలు, తడకలు అల్లుతున్నారు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం వెంకేపల్లి గ్రామానికి చెందిన పిట్టల పాపయ్య, రామనర్సమ్మ దంపతులు. వృద్ధాప్యంలోనూ అష్టకష్టాలు(blind old man problems) పడుతున్నారు. పాపయ్యకు కంటిచూపు లేదు. ఐనా... భార్యతో కలిసి బుట్టలు, తడకలు అల్లుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కనీసం ఉండేందుకు పక్కా ఇల్లు కూడా లేని దుస్థితి. నిబంధనల పేరుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అధికారులు దూరం చేశారు.
పింఛను వస్తలేదు..
పాపయ్యకు 2013 నుంచి వృద్ధాప్య పింఛను వచ్చేది. రేషన్ సరుకులూ వచ్చేవి. సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం... వీరికి శరాఘాతంలా మారింది. కంటిచూపు లేకపోవడం, ఐరిస్ సమస్యల వల్ల పాపయ్యకు ఆధార్ కార్డు రాలేదు. ఈ కారణం చూపి అధికారులు ఆయన పింఛను, రేషన్ తొలగించారు. ఆధార్ కార్డు ఉన్న రామనర్సమ్మకు మాత్రమే రేషన్‌సరుకులు ఇస్తున్నారు.
ఈ పని తప్పించి ఏ పనికీ పోలేను. ఆయనకు కండ్లు కానరావు. అసలే పోయినయ్. ఉన్న ఒక్క కొడుకు చనిపోయిండు. మాకు అండ ఆదెరువు లేకుండా పోయింది. ఆయనకు పింఛను వస్తలేదు. పింఛను రాక ఇప్పుడు ఏడాది. అటువరకు ఇచ్చిన్రు. ఇప్పుడు వేలిముద్రలు పడుతలేవని ఇస్తలేరు. వాళ్లను అడిగి అడిగి ప్రాణం విసుగు వచ్చింది. ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలి.
-రామనర్సమ్మ, బాధితురాలు
రేషన్‌కార్డుపై ఒకరికే వచ్చే బియ్యం ఆ వృద్ధ దంపతులకు సరిపోవడం లేదు. పింఛను తొలగించడంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. రెండేళ్ల క్రితం వారి కుమారుడు మృతిచెందడంతో పాపయ్య, రామనర్సమ్మ దిక్కులేని వారయ్యారు. చేతికర్ర సాయంతో ఆ వృద్ధ దంపతులు గ్రామ శివారులోని ఈత చెట్ల వద్దకు వెళ్లి... ఆ కర్రలను తీసుకొస్తారు. వాటిని ఎండబెట్టి కళ్లు లేకున్నా చేతివేళ్ల స్పర్శతో బుట్టలు అల్లుతున్నారు ఆ వృద్ధుడు. అలా బుట్టలు అమ్మి... పొట్టపోసుకుంటున్నారు. తమ దుస్థితిపై అధికారులు స్పందించి... పింఛను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వాళ్లకు ఒక్క కొడుకు ఉంటే... ఆ ఒక్క కొడుకు కూడా చనిపోయిండు. చూసేందుకు వారికి ఎవరూ లేరు. ఆ ముసలాయనకు కండ్లు అవుపడవు. ఆమె పెద్దమనిషి అయిపోయింది. వాళ్లకు దిక్కు దశ ఎవరూ లేరు. వాళ్లనో వీళ్లనో అడుక్కొని బతుకుతున్నారు. ఆధార్ కార్డు లేకపోవడం వల్ల పింఛను కూడా వస్తలేదు. వాళ్లు బతకడానికి ఎలాంటి ఆధారం లేదు. ఆస్తులు లేవు. చివరకు ఇల్లు కూడా మామూలు పూరిపాక. వాళ్లకు ప్రభుత్వం తరఫున అందే సంక్షేమ పథకాలను అమలుచేయాలని కోరుతున్నాం.
-గ్రామస్థులు
పాపయ్యకు పింఛను తొలగించిన అధికారులు... కనీసం రామనర్సమ్మకైనా ఇవ్వడం లేదు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి.... వృద్ధ దంపతుల్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం.. రూ. 32 లక్షలు మోసం