సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రి ఆవరణలో ఓ మహిళ ప్రసవించింది. హుజూర్ నగర్ మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన తెప్పని ప్రభావతి పురిటి నొప్పులతో ఆశా వర్కర్ విజయలక్ష్మి, భర్త అశోక్‌తో కలిసి హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రి వర్గాలు ఆమెకు కరోనా పరీక్షలు చేయనిదే.. లోనికి అనుమతించమని తేల్చి చెప్పారు.
ఆమె పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్నా.. కరోనా పరీక్షలు చేయించాల్సిందే అని పట్టుబట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె భర్త ప్రభావతిని కరోనా పరీక్షలు చేయించడానికి తీసుకెళ్తుండగా.. అక్కడే కుప్పకూలి.. పురిటి నొప్పులతో మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే ఆమెకు కరోనా పరీక్షలు చేయకుండానే ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లి చికిత్స చేశారు. కాగా.. ప్రభావతి ఆస్పత్రి ఆవరణలో ప్రసవించలేదని.. కరోనా పరీక్ష కేంద్రం వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లడం వల్ల పురిటి నొప్పులతో ఇబ్బందిపడి కుప్ప కూలినట్లు ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. ఆమె ఆస్పత్రి ఆవరణలో కాకుండా.. లోపల వైద్యుల సమక్షంలోనే ప్రసవించిందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి