Modi Godhra Train Burning : గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన "ది సబర్మతి రిపోర్ట్" (The Sabarmati Report) సినిమాపై పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నిజాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. "కల్పిత కథనాలు పరిమిత కాలం వరకు మాత్రమే కొనసాగుతాయి. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని మోదీ పేర్కొన్నారు. ఈ సినిమాని ఉద్దేశించి ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌పై ప్రధాని మోదీ ఈ విధంగా స్పందించారు.
Well said. It is good that this truth is coming out, and that too in a way common people can see it.
— Narendra Modi (@narendramodi) November 17, 2024
A fake narrative can persist only for a limited period of time. Eventually, the facts will always come out! https://t.co/8XXo5hQe2y
గుజరాత్ అల్లర్లు
2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహన కాండ దేశాన్ని కలచివేసింది. ఆ ఏడాది ఫిబ్రవరి 27న పంచమహాల్ జిల్లాలోని గోద్రా పట్టణంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనను ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా "ది సబర్మతి రిపోర్ట్" సినిమా రూపొందించారు. విక్రాంత్ మాస్సే, రాశీఖన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. రిధి డోగ్రా కీలక పాత్ర పోషించారు. నవంబర్ 15న ఈ మూవీ విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీని ఉద్దేశించి ఒక నెటిజన్ "ఎక్స్"లో పోస్ట్ పెట్టాడు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని తప్పక చూడాలని అతను పేర్కొన్నారు. సున్నితమైన అంశాన్ని దర్శకుడు చాలా చక్కగా చూపించారన్నారు. ఒక నాయకుడి గొప్పతనానికి భంగం కలిగించే విధంగా కొన్ని మంది వ్యక్తులు కావాలని దీనిని ఆ రోజుల్లో రాజకీయం చేశారని పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు.
ది కశ్మీర్ ఫైల్స్
ప్రధాని మోదీ గతంలోనూ పలు సినిమాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. 2022లో వివేక్ అగ్నిహోత్రి తీసిన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని ఆయన ఎంతగానో ప్రశంసించారు. కొన్ని దశాబ్దాలుగా దాచిపెట్టిన వాస్తవాలు, ఇన్నాళ్లైనా బయటకు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో నిజం వెంట నిలబడటం ప్రజలందరి బాధ్యత అని మోదీ పేర్కొన్నారు. గత ఏడాది కర్ణాటక పర్యటన సమయంలోనూ 'ది కేరళ స్టోరీ' సినిమా గురించి కూడా ప్రస్తావించారు. అత్యంత ప్రతిభవంతులతో, మేధావులతో కూడిన కేరళ లాంటి సుందర ప్రదేశంలోనూ టెర్రరిజం విస్తరిస్తున్న పరిణామాలను ఈ చిత్రం బహిర్గతం చేసిందని అన్నారు.