హుజూర్నగర్ ఉపఎన్నిక ప్రచారం... నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలతో పాటు... స్వతంత్ర అభ్యర్థులు సైతం ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అధికార పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని గెలిపించాలంటూ మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీలు మాలోత్ కవిత, బడుగుల లింగయ్య యాదవ్... సజ్జాపురం చెరువుకుంట తండాలో ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి సైదిరెడ్డి... గరిడేపల్లి మండలం కాచవారిగూడెంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఇంటింటికి తిరుగుతూ...
కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని గెలిపించాలంటూ... భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరేడుచర్లలో పర్యటించారు. అభ్యర్థితో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. మండలంలోని చిల్లపల్లి, సోమారం, మేడారం, యల్లారం, ముకుందాపురం, గురుకుల తండాలు చుట్టివచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గరిడేపల్లి మండలం శీత్లా తండాలో ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రంలో బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
అభివృద్ధి చేస్తామంటూ...
భాజపా అభ్యర్థి కోటా రామారావు... హుజూర్నగర్ రైతు బజార్ వద్ద ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మోదీ సర్కారు అమలు చేస్తున్న పథకాల్ని వివరించారు. తనను గెలిపిస్తే పెద్దఎత్తున నిధులు తెచ్చి... నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గరిడేపల్లి మండలం కీతవారిగూడెం, మాచవరం, గోపాలపురం గ్రామాల్లో... తెదేపా అభ్యర్థి చావా కిరణ్మయి ఓటర్లను కలుసుకున్నారు.
స్వతంత్రుల సమరశంఖం...
స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు... ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. మేళ్లచెరువులో ప్రచారం చేస్తున్న సమయంలో... సౌండ్ బాక్సులు ఉపయోగించొద్దంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మల్లన్న... సీఐపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: సడలని సర్కార్... మూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె