Minister Jagadish reddy: రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఇటీవల కాలంలో భాజపా నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరులతో బుధవారం మంత్రి మాట్లాడారు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే ఆమెను గౌరవిస్తామన్నారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని భాజపా రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తుండటంతోనే సమస్య ఉత్పన్నమవుతోందని చెప్పారు. ప్రొటోకాల్ పాటించడంలో, పెద్దవాళ్లను గౌరవించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపక్వతతో వ్యవహరిస్తారని పేర్కొన్నారు. సీఎంతో చర్చకు సిద్ధమని గవర్నర్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గవర్నర్‌కు సీఎంతో చర్చించుకోవాల్సిన సమస్యలు ఏముంటాయని ప్రశ్నించారు. ఎవరైనా రాజ్యాంగ పరిమితులకు లోబడి పనిచేయాలన్నారు. గవర్నర్ రాజ్యాంగం ప్రకారం విధులు నిర్వర్తిస్తే సమస్యలు తలెత్తవని చెప్పారు. దేశంలో ఇలాంటి సమస్యలు కొత్తగా చోటుచేసుకోలేదని, ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత అంశాలేనని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి విషయంలో స్పందిస్తూ ‘రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫార్సును గవర్నర్ ఆమోదించాలే తప్ప.. అందుకు భిన్నంగా పోవడమంటే.. వేరే రకంగా ప్రవర్తిస్తున్నారనటంలో సందేహమేమీ లేదు..’ అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాలూ సేవారంగంలోకే వస్తాయన్నారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధంగా, రాజకీయాలకతీతంగా వ్యవహరించాల్సిన పదవిలో ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిని కేంద్ర ప్రభుత్వం ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి వారు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎలా ఉండాలో చెప్పడం సరికాదన్నారు. రాజ్యాంగ పదవుల పట్ల తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని... ప్రొటోకాల్ విషయంలో లోపాలపై ఎప్పుడూ స్పందించని గవర్నర్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తమిళిసై ఎక్కడికైనా గవర్నర్ హోదాలో పర్యటిస్తే ఆమెను స్వాగతించడానికి అభ్యంతరం లేదని.. అలా కాకుండా భాజపా నాయకురాలిగా వస్తే ప్రొటోకాల్ ఎందుకు పాటిస్తామన్నారు. రాజ్యాంగబద్ధంగానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించామని స్పష్టం చేశారు. తమ వైపు నుంచి గవర్నర్‌కు ఎలాంటి సమస్య లేదన్నారు. గతంలో గవర్నర్‌గా నరసింహన్ ఉన్నప్పుడు రాని సమస్య ఇప్పుడెందుకు వస్తుందని మంత్రి ప్రశ్నించారు.
ప్రధానమంత్రి మోదీని కలిసి వచ్చిన తర్వాత గవర్నర్ తమిళిసైలో మార్పు కన్పిస్తోంది. రాజ్యాంగబద్ద పదవిలో కొనసాగుతున్న తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌లా కాకుండా భాజపా నేతగా వ్యవహరిస్తేనే అభ్యంతరకరం. మా ప్రభుత్వానికి రాజ్యాంగ పదవుల పట్ల అపారమైన గౌరవం ఉంది. తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవిలో వస్తే ఎటువంటి ఇబ్బందిలేదు.. గవర్నర్ పదవి ముసుగులో భాజపా నాయకురాలిగా వస్తే మాత్రమే సమస్య అవుతుంది. రాజ్యాంగ బద్ధంగానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాం. మా వైపు నుంచి సమస్యలేదు. గత గవర్నర్ నరసింహన్ ఉన్నపుడు లేని సమస్య ఇప్పుడెందుకు వస్తోంది?. -మంత్రి జగదీష్ రెడ్డి
ఇదీ చదవండి: ఈ నెల 14 నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర : బండి సంజయ్