ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తలపెట్టిన 'ప్రజల కోసం-ప్రగతి కోసం' కార్యక్రమంలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి పర్యటించారు.
ఇరువురు వార్డుల్లో తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ప్రధాన సమస్యగా మారిన 33 కేవీ విద్యుత్ తీగలను తొలగిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. బాధ్యతను మరవకుండా 'ప్రజల కోసం- ప్రగతి కోసం' కార్యక్రమం తలపెట్టిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ను అభినందించారు. కోదాడ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ వనపర్తి శిరీష తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: విరగబూసిన మామిడి పూత... ఆనందంలో రైతులు