paddy procurement delay: ఈ దృశ్యాలు చాలు...! ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు ఎన్నిపాట్లు పడుతున్నారో చెప్పేందుకు..! ఓవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపురాశులు..! మరోవైపు కురుస్తున్న వర్షాలు..! ఈ రెండింటి నడుమ సరిపడా టార్పిలిన్ కవర్లు లేకున్నా, అధికారుల నుంచి పూర్తి సహకారం అందకున్నా... చేతనైంత స్థాయిలో పంటను కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. వారి శక్తి సామర్థ్యాలు సరిపోక.. ధాన్యం తడిచి మొలకెత్తడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో అలమటిస్తున్నారు.
కాళ్లమీదపడి పడి మరీ..
వర్షానికి ధాన్యం తడిచి నిస్సహాయ స్థితిలో వెళ్తున్న పంటను కొనాలంటూ అన్నదాత వేడుకుంటున్నాడు. ఏకంగా అధికారుల కాళ్లమీద పడి అర్థించిన ఘటన జనగామలో చోటుచేసుకుంది. జనగామ మార్కెట్ కాటన్ యార్డుకు అధికారులు వచ్చారని... ధాన్యంపై కప్పిన టార్పాలిన్ కవర్లను రైతులు తొలగించారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కురిసిన వర్షానికి 150 బస్తాల వరకు కొట్టుకుపోగా...., 10వేల బస్తాలకుపైగా ధాన్యం తడిసిపోయింది. దీంతో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఓ రైతు డీఎంవో నాగేశ్వర్‌రావు కాళ్లపై పడి వేడుకున్నాడు.
అన్ని చోట్ల అదే పరిస్థితి
ఇక్కడ ఒకచోటే కాదు... రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి. ములుగు జిల్లాలో అనేక మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి.... నెలరోజులు దాటినప్పటికీ కొనుగోలు ప్రారంభించలేదని రైతులు చెబుతున్నారు. వర్షానికి ఆరబోసిన ధాన్యం తడిసి ధాన్యం మొలకెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెరువులను తలపిస్తున్నాయి
సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల మండలంలోని గ్రామాల్లో వర్షానికి ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపించాయి. అప్రమత్తమైన రైతులు వడ్లు కొట్టుకుపోకుండా కాల్వలు తీశారు. ధాన్యం కుప్పల వద్ద నిరంతరం పడిగాపులు కాస్తున్నామని.... త్వరగా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అన్నం పెట్టే అన్నదాత.. రోడ్డెక్కాడు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మిదేవిపల్లిలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. నెలరోజులు గడుస్తున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు..
ఇదీ చూడండి: Today Weather Report: రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు