కరోనా మహమ్మారి విసిరిన పంజాకు ఎంతో మంది ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి. కరోనా మొదటి దశ తగ్గుముఖం పట్టేనాటికి కొన్ని రంగాలు గాడిన పడగా... మరికొన్నింటి పరిస్థితి ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉంది. ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులను వైరస్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. పాఠశాలలు, కళాశాలలు తెరవకపోవడంతో వారి బతుకు అతలాకుతలమైంది. ఆన్లైన్ క్లాసులకు ప్రభుత్వం అనుమతిచ్చినా.. విద్యార్థుల నుంచి సరైన స్పందన లేదనే సాకుతో యాజమాన్యాలు వేతనాలపై వేటు విధిస్తున్నాయి. ఉపాధ్యాయుల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారికి ఉచిత బియ్యంతోపాటు నెలకు రెండువేల భృతిని అందిస్తోంది. ఇది ప్రైవేటు ఉపాధ్యాయులకు కొంత ఊరటనివ్వగా... ప్రైవేటు కళాశాల అధ్యాపకులకు మాత్రం నిరాశే మిగిల్చింది. ఇన్ని ప్రతికూలతల మధ్య... బోధననే నమ్ముకున్న ఆ అధ్యాపకులు తమ బాధలు తీర్చుకునేందుకు ఉపాధి హామీ పథకాన్నే మార్గంగా ఎంచుకున్నారు.
గౌరవమే తప్ప పని దొరకలే..
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాలకు చెందిన పలువురు... సుమారు పదేళ్లుగా బోధన రంగంలో ఉన్నారు. మండల కేంద్రంలోని ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ఆయా సబ్జెక్టులను బోధిస్తూ జీవనం సాగిస్తున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో విద్యాసంస్థలు మూతపడటం వల్ల వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఉపాధి కరవవటంతో ఆర్థికంగా కష్టాలు ప్రారంభమయ్యాయి. సొంతూరికి వెళ్లి ఏదైనా పనిచేసుకుంటామని వెలిశాలకు వచ్చేశారు. బోధననే వృత్తిగా ఎంచుకున్న వారు కరోనా తీసిన దెబ్బతో.. ఏదో ఒక పని చేసేందుకు సిద్ధమయ్యారు. సార్ అంటూ సంబోధిస్తూ గౌరవం ఇవ్వటమే తప్ప... ఎవరూ పని మాత్రం ఇవ్వలేదు. ఏ పనీ దొరకకపోవడం వల్ల... సర్పంచ్‌తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు తమకూ అవకాశం కల్పించాలని వేడుకున్నారు. సర్పంచ్, కార్యదర్శి సానుకూలంగా స్పందించటంతో... ఏడాది నుంచి గ్రామస్థులతోపాటు ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తూ... పొట్టపోసుకుంటున్నారు
- ఉపాధి హామీనే ఆధారం...
"దాదాపు పదేళ్లుగా బోధననే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. కరోనా వల్ల కళాశాలు మూతపడటం వల్ల మా జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ఎక్కడికి వెళ్లినా పని దొరకలేదు. కుటుంబ పోషణ భారమైంది. ఆ సమయంలోనే సర్పంచ్ దగ్గరికి వెళ్లి మేమూ ఉపాధి హామీ పనులు చేస్తామని కోరగా.. మాకు అవకాశం కల్పించారు. రోజుకు రూ. 170 నుంచి రూ. 230 వరకు కూలీ అందుతుంది. భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించుకుంటే భయంగా ఉంది. ప్రస్తుతం మా కుటుంబాలను ఉపాధి హామీ పనులైతే ఆదుకుంటున్నాయి. ఇప్పుడు ఇదే ఆధారమైంది. కానీ ప్రభుత్వమే మాకు శాశ్వత పరిష్కారం చూపించాలి."
- అధ్యాపకులు, వెలిశాల.
ఉద్యోగావకాశాలు కల్పించండి..
ఉన్నత చదువులు చదివిన తమకు విద్యార్హతకు తగిన ఉద్యోగావకాశాలు కల్పించాలని అధ్యాపకులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎంతోమంది ప్రైవేటు అధ్యాపకులు కరోనా భారిన పడి.. సరైన చికిత్స పొందలేక ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వాళ్లందరి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి... ప్రైవేటు అద్యాపకులకు ఉపాధి కల్పించాలని విన్నవించుకున్నారు. కనీసం... ప్రైవేటు ఉపాధ్యాయులకు ఇచ్చినట్టు రెండు వేల ప్రోత్సాహకం, బియ్యమైనా అందించాలని వేడుకుంటున్నారు