ఎన్నో అనుమానాలు, అపోహల నడుమ రాష్ట్రం సాధించుకున్నామని... ఇప్పుడు అందరూ మన వైపు చూసేలా అభివృద్ధి సాధిస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రతి ఇంచు భూమికి నీరందించడమే ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికి ఉప ఎన్నికల్లో విజయాన్ని కట్టబెట్టినందుకు... కృతజ్ఞత సూచకంగా హుజూర్ నగర్లో సీఎం పర్యటించారు. పట్టణ శివారులో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని... నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ప్రకటించారు.
20 రోజుల్లో నియోజకవర్గానికి వస్తా..
ప్రతిపక్షాలపై విరుచుకుపడే కేసీఆర్... హుజూర్‌నగర్ సభలో వారి ఊసెత్తకుండా నియోజకవర్గం గురించే ఎక్కువగా మాట్లాడారు. నిర్దిష్టమైన కేటాయింపులున్నా... నాగార్జునసాగర్ ఆయకట్టుకు ఏనాడూ వంద టీఎంసీల నీటిని వాడుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 20 రోజుల్లో నియోజకవర్గానికి వచ్చి హుజూర్‌నగర్ నుంచి సాగర్ వరకు పర్యటిస్తానని తెలియజేశారు.
త్వరలో రింగ్ రోడ్డు, ట్యాంక్ బండ్ నిర్మాణం
ఉప ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతగా ప్రజలకు ముఖ్యమంత్రి వరాలు ప్రకటించారు. 141 గ్రామాల్లో ఏడు మండల కేంద్రాలను మినహాయించి... ఒక్కో గ్రామానికి 20 లక్షలు, మండల కేంద్రాలకు 30 లక్షలు ప్రకటించారు. హుజూర్‌నగర్ పురపాలికకు 25 కోట్లు, నేరేడుచర్ల పురపాలికకు 15 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. హుజూర్‌నగర్ చుట్టూ రింగ్ రోడ్డు, ట్యాంక్ బండ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
ఈఎస్ఐ, పాలిటెక్నిక్ కళాశాలకు ఉత్తర్వులు
మట్టపల్లి ఆలయం, జాన్ పహాడ్ దర్గాను మరోసారి వచ్చినప్పుడు దర్శించుకుంటానని కేసీఆర్ అన్నారు. గిరిజనులకు బంజారా భవన్, రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈఎస్ఐ ఆసుపత్రి, పాలిటెక్నిక్ కళాశాలకు తక్షణమే ఉత్తర్వులు ఇస్తున్నట్లు సభా వేదికగా ప్రకటించారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపైకి ప్రజలు భారీ ఎత్తున వచ్చారు. వాహనంలో నుంచే దారి పొడవునా ముఖ్యమంత్రి అభివాదం చేసుకుంటు వెళ్లారు.
ఇదీ చూడండి: బాణాసంచా కాల్చుతున్నారా... ఈ జాగ్రత్తలు పాటించండి