A fake doctor in Kantivelugu camp in suryapet district: ఒకరి బదులు ఒకరు చేయడానికి మాములు వ్యవసాయపని కాదు. ఏ మాత్రం అశ్రద్ధ చేసిన రోగుల ప్రాణాలకే ముప్పు వస్తుంది. ప్రాణాలు పోయాల్సిన వారి స్థానంలో నకిలీ డాక్టర్లు వచ్చి ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్థాత్మకంగా తీసుకొచ్చిన పథకం కంటివెలుగు శిబిరంలో కొన్ని చోట్ల డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రభుత్వ వైద్యురాలైన భార్యకు బదులు భర్త విధులకు హాజరైన ఘటన బుధవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పురపాలిక పరిధిలో జరిగింది. ఆరో వార్డులోని మాలిపురం పల్లె దవాఖానాలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం మాలిపురం పల్లె దవాఖాన వైద్యురాలు డాక్టర్ వాసవి సెలవులో ఉండటంతో అక్కడ విధులు నిర్వహించాలని మండలంలోని జలాలప్పురం పల్లెదవాఖాన వైద్యురాలు లక్ష్మీ సుధను మండల వైద్యాధికారి మల్లెల వందన ఆదేశించారు.
బుధవారం భర్తతో పాటు ఆసుపత్రికి వచ్చిన డాక్టర్ లక్ష్మీసుధ విధులు నిర్వహించకుండా ఉపకేంద్రం బయట కూర్చున్నారు. ఆమె భర్త మాత్రం కంటి వెలుగు శిబిరంలో వైద్యురాలి సీటులో కూర్చొని వైద్యసేవలు అందిస్తానని చెప్పడంతో అక్కడున్న సిబ్బంది అభ్యంతరం చెప్పారు. దీంతో వారిపై ఆయన ఇష్టానుసారంగా మాట్లాడారు. వెంటనే వారు సీహెచ్ బిచ్చునాయక్కు సమాచారం ఇచ్చారు.
సీహెచ్ అక్కడికి చేరుకొని 'మీరెవరు? ఎందుకు ఇక్కడ ఉన్నార'ని అని వైద్యురాలు భర్తను ఆరా తీశారు. ఆయన ఎదురు ప్రశ్నించడంతోపాటు నిర్లక్ష్యంగా మాట్లాడటంతో వెంటనే సీహెచ్ జిల్లా వైద్యాధికారికి మౌఖికంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయం జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలంకు డాక్టర్ లక్ష్మీసుధ భర్త విధులు నిర్వహించినట్లు తెలిసిందని, సదరు వ్యక్తులపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విధుల్లో ఉన్నవారు మాత్రమే సేవలందించాలని, ఇతరులు చేపట్టవద్దని హెచ్చరించారు.
ఇవీ చదవండి: