ఆడుతూ పాడుతూ ఉండాల్సిన తనయుడు అరుదైన వ్యాధితో... నరకయాతన పడుతుంటే... ఏంచేయాలో పాలుపోక రోధిస్తున్నారు తల్లిదండ్రులు. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌కు చెందిన మహమ్మద్ రఫీ, బేగంల కుమారుడు మహమ్మద్ మోహిన్ బాబా... ఎనిమిదో తరగతిలో అరుదైన వ్యాధితో మంచానికి పరిమితమయ్యాడు.
ఉన్నదంతా ఊడ్చి
ఆర్ఎంపీగా పనిచేస్తున్న రఫీ... కుమారుడిని బాగు చేసుకోడానికి ఆస్తులన్నీ అమ్మి వైద్యం చేయించాడు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రి వైద్యులు... బాబాకు అరుదుగా వచ్చే వైరల్ ఇన్ సపోలిటీఎస్ అనే మెదడు నరానికి సంబంధించిన వ్యాధి వచ్చినట్లు తేల్చారు. కొడుకును దక్కించుకోవడానికి సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేశాడు. అక్కడ తగ్గక పోయేసరికి కేరళలోని ఆయుర్వేద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం తమ కుమారుడి ఆరోగ్యం మెరుగవుతుందన్న ఆశ కలిగిందని బాబా తండ్రి తెలిపారు. ఆర్థిక స్థోమత లేక వైద్యానికి ఇబ్బందవుతోందని... దాతలు స్పందించి... తన కుమారుడిని బతికించమంటూ ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
దాతలు స్పందించండి
వారి కష్టాలను చూసిన స్థానికులు తమ వంతు సాయం చేస్తున్నారు. ప్రభుత్వం, దాతలు స్పందించి బాలుడి వైద్యానికి ముందుకు రావాలని కోరుతున్నారు. వేడుకలకు, సంబురాలకు ఎంతో ఖర్చు చేస్తాం... పెద్ద మనసుతో ఈ బాలుడికి చేసే సాయం ఓ ప్రాణాన్ని నిలబెట్టడమే కాదు... ఓ కుటుంబానికి ఊపిరి పోస్తుంది.