సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోలు గ్రామ శివారులోని వాగు నుంచి జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనుల కోసమని ఇసుకను అడ్డగోలుగా తరలిస్తున్నరంటూ ట్రాక్టర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. దీనితో పోలీసులకు గ్రామస్థులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పోలీసులతో మాట్లాడగా అనుమతితోనే జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులకు ఇసుకను తరలిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు 180 ట్రిప్పుల వరకు ఇసుకను వాగు నుంచి తీసుకెళ్లారని గ్రామస్థులు ఆరోపించారు. ఇష్టారాజ్యంగా వాగులోని ఇసుకను తవ్వడం వల్ల గుంతలు ఏర్పడి వర్షాకాలంలో గ్రామస్థులు మునిగి చనిపోతున్నారని వాపోయారు. 6 నెలల క్రితం ఇలాంటి ప్రమాదకర గుంతల్లోనే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు పడి చనిపోయారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం వరకు ఇసుక రవాణాను నిలిపివేస్తామని పోలీసులు హామీ ఇవ్వడం వల్ల ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్