సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ మూల సిద్దాంతమని పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడ సామాజిక న్యాయానికి విఘాతం కలిగినా అక్కడ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. సిద్దిపేట నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి నుంచి పోటీ చేసిన భవాని రెడ్డితో సహా మరో 10 మంది అనుచరులు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
హైకోర్టు చెప్పేవరకు
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారీగా కరోనాతో మరణించిన వారి వివరాలను పీసీసీకి గాంధీభవన్‌లో అందచేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. పూర్తి వివరాలు అందిన తరువాత గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. హైకోర్టు చెప్పేవరకు ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.
బిల్లులు చూసి..
రోజుకు 70 వేల నుంచి లక్ష రూపాయలు కరోనా బాధితుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయని అన్నారు. ఈ బిల్లులు చూసే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోందని ఆయన ప్రశ్నించారు.
పది లక్షలు ఇవ్వాలి
కరోనా లెక్కలు ప్రభుత్వ పెద్దలు అనుకున్న మేరకే బయటకి వెల్లడవుతున్నాయని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మరణాల సంఖ్యను ప్రభుత్వం దాస్తోందని ఆరోపించారు. కరోనాతో మృతి చెందిన బీపీఎల్ బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : హెచ్ఎండీఏ మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించిన కేటీఆర్