Alternative Crops in Telangana: రాజధాని నగరానికి సుమారు 45 కి.మీ. దూరంలో ఉన్న ఆ గ్రామమది. సంప్రదాయ పంటలు.. తద్వారా వస్తున్న నష్టాల దిగుబడులతో విసుగెత్తిన ఆ గ్రామస్థులు కాస్త కొత్తగా ఆలోచించారు. మార్కెట్‌లో నిరంతరం గిరాకీ ఉన్న పంటలకే జైకొట్టారు. ఇంకేముంది! సాగు వారికి సాగిలపడింది. ధనలక్ష్మి వాకిట వాలింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం నర్సంపల్లి గ్రామ రైతుల విజయ గాథ ఇది.
వీరి కూరగాయలకు మంచి గిరాకీ
Vegetables cultivation in Narsam pally:నర్సంపల్లి గ్రామంలో 330 కుటుంబాలున్నాయి. 741 ఎకరాల సాగు భూమి ఉంది. ఇక్కడ అందరికీ వ్యవసాయమే జీవనాధారం. గతంలో వరి, మొక్కజొన్న, సోయా వంటి సంప్రదాయ పంటలు సాగుచేసి నష్టపోతూ వస్తున్న గ్రామ రైతులు పాత పద్ధతికి స్వస్తిపలికి, కొత్త విధానంలో సాగాలని నిర్ణయించుకున్నారు. ఐదేళ్ల క్రితం అధికారుల సూచనలతో కూరగాయలు సాగుచేయడం మొదలుపెట్టారు. దాదాపు అందరూ తమతమ పొలాల్లో పందిళ్లు నిర్మించుకున్నారు. పందిరిపై బీర, కాకర, సొర, పొట్లకాయ, చిక్కుడు తదితర పంటలు సాగుచేస్తున్నారు. అంతర పంటగా కొందరు టమాట, వంకాయ, బెండ, గోకర, బీన్స్, క్యాప్సికం, కీర, దోసకాయ వంటివీ వేశారు. దిగుబడులను మండల పరిధిలోని వంటిమామిడి కూరగాయల మార్కెట్‌తోపాటు బోయిన్‌పల్లి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా నాణ్యత పరంగా నర్సంపల్లి బీరకాయలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఏర్పడటంతో రిలయన్స్, హెరిటేజ్, బిగ్‌బజార్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు నేరుగా రైతుల వద్దకే వచ్చి కొనుగోలుచేస్తున్నారు. మొత్తంగా ఈ గ్రామస్థులు ఏటా సుమారు నాలుగు లక్షల టన్నుల కూరగాయలు విక్రయిస్తున్నట్టు వీడీసీ ప్రతినిధులు వెల్లడించడం అక్కడి రైతుల విజయానికి నిదర్శనం. 40 శాతం మంది సేంద్రియ విధానాన్ని అనుసరిస్తున్నారని, ఆయా ఉత్పత్తులకు మార్కెట్లో మరింత గిరాకీ ఉంటోందని వారు వెల్లడించారు.
అరెకరంలో నాలుగు రకాలు
ఒక్కో రైతు సుమారు 10 సెంట్ల నుంచి అర ఎకరాకిపైగా విస్తీర్ణంలో పందిళ్లు నిర్మించుకున్నారు. అందులోనే నాలుగు రకాల కూరగాయలు సాగుచేస్తున్నారు. మార్కెట్‌లో ఓ పంటకు ధర తగ్గినా, ఇంకో దానికి మంచి ధర లభిస్తోంది. నర్సంపల్లిలో పండే కూరగాయలు నాణ్యంగా ఉంటాయనే నమ్మకం ఉండటంతో అమ్ముడు పోవనే భయమూ పోయింది. - లక్ష్మణ్, వీడీసీ ఛైర్మన్ నర్సంపల్లి
ఏడాదికి రూ.2 లక్షల ఆదాయం
గతంలో నేలపై కూరగాయలు పండించేవాడిని. దిగుబడి వచ్చినప్పటికీ, నాణ్యత లేకపోవడంతో మార్కెట్‌లో కొనేవారు కాదు. తర్వాత ఎకరం విస్తీర్ణంలో పందిరి వేసి బీర, కాకర సాగుచేశా. అధిక దిగుబడులు వస్తున్నాయి. పంట కూడా నాణ్యంగా ఉండటంతో మార్కెట్‌లో మంచి ధర పలుకుతోంది. ఏడాదికి ఖర్చులన్నీపోను రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తోంది. - నర్సింహులు యువరైతు నర్సంపల్లి
ఇదీ చదవండి: KCR Meet Stalin: కేంద్ర విధానాలపై కలిసి పోరాడాలని నిర్ణయం.. బలమైన కూటమి దిశగా అడుగులు..!