ఆరోగ్య సిద్దిపేట కోసం ప్రతి ఒక్కరం పాటుపడదామని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. చెత్త రహిత, పరిశుభ్ర, ఆకుపచ్చ, స్వచ్ఛ సిద్దిపేట కోసం ప్రజల సహకారం కావాలని కోరారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే... వీధిని కూడా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
పట్టణంలో నిర్మిచిన మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి ప్రారంభించారు. 10వ వార్డు పరిధిలోని వాసవీనగర్ కాలనీలో రూ. 22 లక్షలతో చేపట్టునున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. తడి, పొడి చెత్త వేరు చేయుటకై చెత్తబుట్టలు, జూట్ బ్యాగులు పంపిణీ చేశారు. నర్సాపూర్ సర్కిల్ మీదుగా నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపట్టి... త్వరలో వీధి దీపాలు బిగిస్తామన్నారు.
ఈగలు, దోమలు లేని సిద్దిపేట కోసం ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలన్నారు. పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందన్నారు. పట్టణంలో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తున్నందున ప్రతి ఒక్కరూ వ్యాయామం, వాకింగ్ చేస్తూ... కాలానికనుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: 'కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు'