Sri Konda Laxman Horticulture University 2nd Convocation: రాష్ట్రంలోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 23వ తేదీన సిద్ధపేట జిల్లా ములుగులో ఉన్న విశ్వవిద్యాలయ ప్రధాన ప్రాంగణంలో స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్ హాజరుకానున్నారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి, ఐసీఏఆర్ ఉద్యాన విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆనంద్‌కుమార్ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయం తనదైన శైలిలో ఇప్పటికే అనేక విజయాలను సాధించింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఏర్పాటైన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య విశ్వవిద్యాలయాల్లో దేశం మొత్తంలో శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి మహిళా వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ బి.నీరజ ప్రభాకర్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. గత 8 ఏళ్లలో విద్యాబోధన, విస్తరణ, పరిశోధన రంగాల్లో విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. ఈ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న రాజేంద్రనగర్, మోజెర్ల కళాశాల్లో అండర్ గ్రాడ్యుయేట్, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ దేశంలోనే ప్రతిష్ఠాత్మక ఐసీఏఆర్ అక్రిడిటేషన్‌ను సాధించాయి. 2021 మార్చి 28 నుంచి 2026 మార్చి 27 వరకు అక్రిడిటేషన్ గుర్తింపు కొనసాగనుంది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యలో నాణ్యత పెంచేందుకు 2022-23 విద్యా సంవత్సరం నుంచి ములుగులోని వర్సిటీ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో "పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ సైన్సెస్" ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్‌లో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల భవనం ఇప్పటికే ప్రారంభమైంది. బోధన, విస్తరణ, పరిశోధనలు విస్తృతం చేసేందుకు విశ్వవిద్యాలయం 25 జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, శాస్త్రీయ సంస్థలతో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నామని ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ నీరజ ప్రభాకర్ వెల్లడించారు.
పరిశోధనల్లో వర్సిటీ పురోగతి: వరంగల్ జిల్లాలో మిరప, విత్తన సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కీలక ఉద్యాన పంటల్లో కేంద్రీయ వంగడాల విడుదల కమిటీ 28వ సమావేశంలో ఏఆర్‌ఐ 516 - హెచ్ 516/ఎంఏసీఎస్ 516 అనే మొదటి ద్రాక్ష రకం ఐసీఏఆర్-ఏఐసీఆర్పీ ద్వారా విడుదలకు సంబంధించి నోటిఫికేషన్ సిఫార్సు చేసింది. ఏఆర్‌ఐ- 516 అనే ద్రాక్ష రకం తెలంగాణలో ప్రాసెసింగ్ పరిశ్రమకు అనువైన రకం. చపాట మిరపకు భౌగోళిక గుర్తింపు కోసం వర్సిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మామిడిలో ఫర్టిగేషన్ టెక్నాలజీ, జామలో సమగ్ర పురుగు, పోషక యాజమాన్యం పద్ధతులు ప్రమాణీకరించింది.
పసుపులో తక్కువ ఖర్చుతో విత్తనం నాటే విధానం, సేంద్రీయ ఉత్పత్తులు, విలువల జోడింపు అంశాలను ప్రమాణీకరించింది. నగర సేద్యం శరవేగంగా ముందుకు వెళుతున్న నేపథ్యంలో కాయగూర పంటల్లో భాగంగా పెరటి, మిద్దెతోటలు, పామాయిల్ తోటల యాజమాన్యం, ల్యాండ్ స్కేప్ యాజమాన్యం వంటి అంశాలపై స్వల్పకాలిక సర్టిఫికెట్ శిక్షణ కార్యక్రమం ప్రవేశపెట్టింది. రామగిరి ఖిల్లాలో హార్టీకల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో పామ్‌ఆయిల్ నాటే పద్ధతులు, అంతర పంటలపై వర్సిటీ పరిశోధనలు ప్రారంభించిందని విశ్వవిద్యాలయం కంప్ట్రోలర్, విస్తరణ విభాగం సంచాలకులు డాక్టర్ అడపా కిరణ్‌కుమార్ తెలిపారు.
ఉద్యాన సాగులో అవార్డులు: ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని రామగిరిఖిల్లా "కృషి విజ్ఞాన కేంద్రం" రైతు సమాజానికి చేస్తున్న సాంకేతికత బదిలీ సేవలకు గుర్తింపుగాను ఐసీఏఆర్ నుంచి "జాతీయ స్థాయి కృషి కర్షక్ ఇన్ఫిరేషన్ లీడర్‌షిప్ అవార్డు"ను సొంతం చేసుకుంది. కేవీకే దత్తత గ్రామాలైన మంథని మండలం నాగారం, ముత్తారం మండలంలోని హరిపురంకు 2020-21 సంవత్సరానికిగాను "దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరన్ పురస్కార్" లభించింది. 2020-21 సంబంధించి ఉత్తమ సంవత్సర నివేదిక- 2020, బెస్ట్ ప్రోగ్రాం స్వచ్ఛత సేవ-2020, సీఎల్‌ఎఫ్‌డీ అపరాలల్లో బెస్ట్ ప్రాజెక్ట్స్- 2020 అనే మూడు ప్రశంసా పురస్కారాలు రామగిరిఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఐసీఏఆర్ అటారి జోన్, యాన్యువల్ జోనల్ వర్క్‌షాపు అందుకుంది.
ఇవీ చదవండి: