సిద్దిపేట జిల్లా కొహెడ మండలం శనిగరం పంచాయతీ పరిధి శంకర్ నగర్లో కన్న తండ్రికి అన్నం పెట్టకుండా వదిలేయగా... చికిత్సపొందుతూ చనిపోయిన ఘటనను మరువకముందే కొహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామంలో మంగళవారం మరో ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన బొప్పనపల్లి రాజయ్య (75)కు మల్లేశం, శ్రీనివాస్, రవి ముగ్గురు కుమారులు. మల్లేశం, రవి హైదరాబాద్‌లో ఉంటున్నారు. 12 ఎకరాల భూమిని ముగ్గురు కుమారులకు సమానంగా పంచి ఇవ్వగా.. వృద్ధాప్యంలో ఉన్న రాజయ్యను ముగ్గురు నెలకొకరు చొప్పున పోషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తనవంతు అయిపోయిందని రెండో కుమారుడు శ్రీనివాస్ హైదరాబాద్‌లో ఉంటున్న తమ్ముడు రవికి చరవాణిలో చెప్పి తండ్రిని తీసుకెళ్లమని కోరాడు. అతను తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం వల్ల నేను ఎన్నాళ్లు భరించాలంటూ రెండో కుమారుడు శ్రీనివాస్.. తండ్రి రాజయ్యను గ్రామంలో ఉన్న తమ్ముడు రవి ఇంటి ముందు ఉంచి వెళ్లాడు.
సర్పంచ్ సతీష్ హైదరాబాద్‌లో ఉంటున్న రవికి ఫోన్ చేయగా తనకు సంబంధం లేదన్నట్లు మాట్లాడాడు. దీంతో సర్పంచ్ విషయాన్ని కొహెడ ఎస్సై రాజ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎస్సై గ్రామానికి చేరుకొని శ్రీనివాస్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఇద్దరు కుమారులకు ఫోన్ చేసి బుధవారం స్టేషన్‌కు రావాలని సూచించారు. వీధిలో వదిలేయడం తగదని శ్రీనివాస్‌కు కౌన్సిలింగ్ ఇవ్వగా.. ఆయన తండ్రిని ఇంటికి తీసుకెళ్లారు. దీంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది.
ఇవీ చూడండి: అయినా వాళ్లు దగ్గరికి రాలేదు.. ఆ నలుగురే అన్ని తానై వచ్చారు..