నవంబర్ 3న జరిగే దుబ్బాక ఉప ఎన్నికలో అభ్యర్థులు చేసే ప్రతి పైసా ఖర్చునూ లెక్కించి వారి ఖాతాలోకే జమ చేస్తామని సిద్దిపేట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామ రెడ్డి తెలిపారు. దుబ్బాక ఎన్నికలో పోటీచేసే అభ్యర్థుల ఖర్చులకు సంబంధించిన నియమావళిని వివరించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను వివరించారు.
శాసనసభ ఎన్నికల్లో ప్రతీ అభ్యర్థి నామినేషన్ వేసే దగ్గరి నుంచి ఎన్నికల వరకు ప్రచారం, ఇతరత్ర ఖర్చులు కలుపుకుని మొత్తం రూ.28 లక్షలు మించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిందన్నారు. అభ్యర్థి ఖర్చు నియమావళి హద్దు దాటితే అనర్హత వేటు పడుతుందన్నారు. లావాదేవీలకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాను ప్రారంభించి రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు అభ్యర్థులు చేసే ఖర్చులను ప్రత్యేక ఖాతా నుంచి మాత్రమే చెల్లించాలని కలెక్టర్ తెలిపారు. అభ్యర్ధి తన ఎన్నికల ఏజెంట్‌తో కలిసి జాయింట్‌గా ప్రత్యేక ఖాతాను ప్రారంభించవచ్చునని తెలిపారు.
ఖర్చుల వివరాల ప్రతులను జిల్లా ఎన్నికల అధికారికి విధిగా ఎప్పటికప్పుడు సమర్పించాలన్నారు. రోజువారీ కిరాయిల బిల్లు, ఇతర ఖర్చులను విచ్చలవిడిగా చూపించే అవకాశం లేదన్నారు. దేనికి ఎంత బిల్లు చెల్లించాలో ఎన్నికల కమిషన్ నిర్ణయించిందన్నారు. అంతకంటే ఎక్కువ, తక్కువ బిల్లులు చూపినా అనుమతించమని కలెక్టర్ వివరించారు.