సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లో ధరణి అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కలెక్టర్ వెంకట్రామ రెడ్డి తెలిపారు. ధరణి ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ, స్థానిక సంస్థలు), తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో సీఎస్ సోమేశ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సమావేశంలో తొలుత తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్‌పుస్తకం చట్టం-2020, ధరణి వ్యవసాయ పోర్టల్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ, స్థానిక సంస్థలు), రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లకు వివరించారు. అనంతరం ధరణి సన్నాహాకాలను జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. జాయింట్ సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలను తహశీల్దార్లకు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం... తాజాగా నాలా సవరణ చట్టంతో వ్యవసాయేతర భూముల మార్పిడి అధికారం ఆర్డీవో నుంచి తప్పించి తహసీల్దార్‌కు కట్టబెట్టిందని సోమేశ్‌కుమార్ తెలిపారు.
రాష్ట్రంలోని 570 తహసీల్దార్ కార్యాలయాలలో ఏకీకృత డిజిటల్ సేవల పోర్టల్ ‘ధరణి’ని ప్రారంభించుకోనుండడం రెవెన్యూ చరిత్రలోనే విప్లవాత్మకమన్నారు. అధునాతన సాంకేతిక దన్నుగా ధరణి ద్వారా ప్రజలకు సులభంగా.. వేగంగా.. రెవెన్యూ సేవలు ప్రజలకు అందించే వీలుంటుందన్నారు. ధరణి పోర్టల్ నిర్వహణకు వీలుగా సిద్దిపేట, మెదక్ జిల్లాలలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్, సాప్ట్వేర్, హార్డ్‌వేర్ సదుపాయాలు ఏర్పాటు చేశామని సోమేశ్‌కుమార్‌కు వెంకట్రామరెడ్డి తెలిపారు.