సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలు పండిస్తున్నారు. గణిత ఉపాధ్యాయుడైన మోహన్ రెడ్డి లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఈటీవీలో ప్రసారమయ్యే అన్నదాత కార్యక్రమాన్ని చూసి... ఇంట్లోనే పెరటితోట పెంచేందుకు పూనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా ఇంటి వెనుక ఉన్న 12 గజాల ఖాళీ స్థలంలో 25 రకాల మొక్కలు పెంచుతున్నారు. తక్కువ స్థలంలోనే ఎక్కువ రకాలు పండించేలా ప్రణాళిక చేసుకున్నారు. మొక్కలకు రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు వినియోగిస్తున్నట్లు తెలిపారు. పెరట్లో పండించిన కూరగాయలే ఇంట్లో వంటలకు సరిపోతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాలను... నిరుపయోగంగా ఉంచకుండా కూరగాయలు మొక్కలు, పూల మొక్కలు పెంచుకోవాలని సూచిస్తున్నారు. అవి మనకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయని మోహన్ రెడ్డి అంటున్నారు.