నల్గొండలో తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆస్పత్రిపై తెరాస ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు తీసుకోవడం బాధాకరమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్ అధ్యక్షతన విపక్షాలు సమావేశం నిర్వహించారు. ముందస్తు నోటీసు లేకుండా ఆస్పత్రిని సీజ్ చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు.
అత్యవసరమైన పేదవారికి ఉచితంగా చికిత్స చేస్తూ... కరోనా పేషెంట్లను ఆదుకుంటున్న నవ్య ఆస్పత్రిపై అకారణంగా దాడి చేసి మూయించడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని బుర్ర శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ప్రజా ఉద్యమాల్లో ఎదుగుతున్న చెరుకు సుధాకర్‌ను అణిచి వేయాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. సీజ్ చేసిన ఆస్పత్రిని బేషరతుగా తెరిపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే విపక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్, కాంగ్రెస్ నాయకులు వెన్నరాజు, రాజు నాయక్, సీపీఐ నాయకులు కొయ్యడ కొమురయ్య, గుర్రాల హన్మిరెడ్డి, ఎండీ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.