బస్వాపూర్ గ్రామంలో మొత్తం 1500 మంది నివసిస్తుండగా.. 450 వరకు కుటుంబాలు ఉన్నాయి. అందరూ శ్రమజీవులే. అత్యధికులు వ్యవసాయం మీద ఆధారపడ్డ వారే. గతేడాది కరోనా తొలి విడతలోనూ ఒక్కరే మహమ్మారి చిక్కారు. ఈ క్రమంలో రెండో దశ మొదలుకాగానే స్థానిక పాలకులు, అధికారులు కట్టుదిట్టమైన ఆంక్షలతో వైరస్ బారిన పడకుండా చేయడంలో సఫలీకృతులయ్యారు.
అందరూ కలిసి..
చుట్టుపక్కల గ్రామాల్లో కరోనా కేసులు మెల్లిమెల్లిగా పెరుగుతుండటంతో స్థానిక సర్పంచి ఆలేటి మమత, పాలకవర్గ సభ్యులు సమావేశం అయ్యారు. ఎలాంటి ఆంక్షలు విధించాలో చర్చించుకొని పలు తీర్మానాలు చేశారు. నిబంధనలు విధించుకున్నారు. వాటిని అమలు చేయాలని నిర్ణయించుకొని అడుగేశారు. సర్పంచి, పంచాయతీ కార్యదర్శి, ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంలు ఇంటింటికి తిరుగుతూ జాగ్రత్తలను వివరించారు. కరోనా లక్షణాలపై అవగాహన కల్పించారు. మాస్క్‌లు విధిగా ప్రతి ఒక్కరూ ధరించేలా చర్యలు చేపట్టారు.
పరీక్షలు చేయిస్తూ..
అనుమానం వచ్చిన వారిని ఆలేటి లక్ష్మారెడ్డి స్మారక అంబులెన్స్‌లో మండలంలోని తీగుల్ ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించారు. ఈ విధానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఎవరూ అనవసరంగా బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు. గుంపులుగా గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. శుభకార్యాలను సైతం కొంతమందితోనే కాన్నిచ్చేశారు. స్థానిక రేషన్ దుకాణంలో దూరం పాటిస్తూ బియ్యం తీసుకునే విధానాన్ని అవలంబించారు. కరోనా మొదటి దశలో పొరుగు గ్రామం నుంచి ఇక్కడికి వచ్చిన ఒక మహిళకు మినహా ఇప్పటి వరకు గ్రామస్థులెవరికీ పాజిటివ్ రాలేదని కార్యదర్శి ప్రశాంత్ తెలిపారు. వీధుల్లో తరచూ రసాయనాన్ని పిచికారీ చేయిస్తుండటంతో పాటు పారిశుద్ధ్యం పట్ల దృష్టిసారించారు.
మంత్రి అభినందనలు..
కొవిడ్ విళయ తాండవం చేస్తున్న క్రమంలో ఈ గ్రామంలో కేసులు నమోదు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నందుకు పాలకమండలి, కార్యదర్శిని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ఇక్కడ తీసుకుంటున్న చర్యలపై కార్యదర్శి వాట్సాప్ ద్వారా మంత్రి దృష్టి తీసుకెళ్లగా.. గుడ్ అని మేసేజ్ చేశారు. అనంతరం సర్పంచి ఆలేటి మమతకు ఫోన్ చేసి అభినందించారు.
కట్టుబడి ఉండేలా..: ఆలేటి మమత, సర్పంచి
కరోనా మహమ్మారిని దూరంగా పెట్టడంలో గ్రామస్థులందరి కృషి ఉంది. గ్రామసభలో తీసుకున్న నిర్ణయాలకు అందరం కట్టుబడి ఉన్నాం. అందరూ వ్యవసాయ పనుల్లో నిత్యం నిమగ్నమవడం, ఒకరి ఇంటికి మరొకరు వెళ్లకపోవడంతో వైరస్ వ్యాప్తి చెందలేదు. ఇదే తీరును భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం
ఇదీ చదవండి: కరోనా టెస్టుకు వెళ్లి.. క్యూలో ఉండగానే ప్రసవం!