ఫిబ్రవరి 13న సిద్దిపేట జిల్లా గ్రంథాలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. పట్టణంలోని బ్యాంకర్ల కాలనీలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన జిల్లా గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, రాష్ట్ర లైబ్రరీ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్‌లతో కలిసి మంత్రి పరిశీలించారు. జిల్లా గ్రంథాలయ హాల్స్, భవన నిర్మాణం చాలా బాగుందన్నారు. పెండింగులో ఉన్న పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని లైబ్రరీ వర్గాలు, ఇంజినీర్లను మంత్రి ఆదేశించారు.
పోటీ పరీక్షలకు చదివే వాళ్ల కోసం హాల్ ఉండాల్సిన తీరుతెన్నుల గురించి జిల్లా కలెక్టర్, రాష్ట్ర, జిల్లా గ్రంథాలయ, ఏఏంసీ ఛైర్మన్లతో సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా గ్రంథాలయంలో ప్రత్యేకతలపై ఒక్కో గదిని క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత త్వరగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వాటిలో రీడింగ్ హాల్, సీనియర్ సిటిజన్ సెక్షన్, కాంపిటేటీవ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సెక్షన్, ఉర్దూ సెక్షన్, మహిళలు, పిల్లలు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెక్షన్- డిజిటల్ ఓరియెంటేషన్ ప్రొజెక్టర్ ద్వారా రీడింగ్ ఉండేలా స్క్రీన్ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.