వానాకాలంలో పండించిన ప్రతీ ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. ఉప్పుడు బియ్యం కేంద్రం కొనకపోవడం వల్లే వరి కొనుగోళ్లలో ఆలస్యమవుతుందని వివరించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్, పెద్ద కోడూర్, రామునిపట్ల గ్రామాల్లో పర్యటించిన ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి (Harish Rao visit grain purchasing centers).. కొనుగోలు తీరును పరిశీలించారు. వడ్లు కొనేందుకే ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని... సాధ్యమైనంత వరకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
మాట నిలబెట్టుకుంటాం..
కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. వర్షాలు వల్ల ధాన్యం కొనుగోలు విషయంలో కొంత జాప్యం జరుగుతోందని హరీశ్‌రావు అన్నారు. ధాన్యం కొనుగోలు విషయమై కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడతామని మంత్రి పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రానికి ఒకనీతి.. తెలంగాణకు ఒకనీతా అని ప్రశ్నించారు.
అది రైతుల విజయం
అన్నదాతలకు గుదిబండలా మారిన నల్ల చట్టాల రద్దు (CENTRES DECISION TO REPEAL THREE FARM LAW).. రైతుల విజయమని మంత్రి అభివర్ణించారు. ఏడాది కాలం పాటు రైతుల దీక్షకు కేంద్రం దిగొచ్చిందని పేర్కొన్నారు. నల్ల చట్టాలు అమలైతే వ్యవసాయం కార్పొరేట్ పాలయ్యేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. రైతుల పక్షాన సీఎం కేసీఆర్ స్వయంగా ధర్నా (cm kcr dharna) చేపట్టారని పేర్కొన్నారు. వానాకాలం పంట మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని.. కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు రోజుకు రెండు గంటల పాటు కొనుగోలు కేంద్రాల వద్ద ఉండాలని సూచించారు.
'ఎండాకాలం పండిన వడ్లన్నీ కూడా బాయిల్డ్ రైస్‌కే పోతాయి. బాయిల్డ్ రైస్ కొనమని కేంద్రం ప్రకటన చేసింది. ఇది చాలా హేయమైనటువంటిది. వడ్లు కొనము అనేది కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వ తన విధానాలు మార్చుకోవాలి. పెద్ద పెద్ద ఊళ్లలో పంట ఎక్కువగా పండిన చోట ఐకేపీ సెంటర్లు, పీఏసీఏ సెంటర్లు పెట్టినాం. ఒకరోజు వెనుకా ముందు కావొచ్చు... ఈ వానాకాలంలో రైతులకు ఇబ్బంది రాకుండా పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడం వల్ల ఇబ్బంది అవుతోంది. కేంద్ర ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ ఉంటే బాయిల్డ్ రైస్‌కు అవకాశం ఇవ్వాలి.' -హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
ఇదీ చూడండి: రైతులకు కేసీఆర్ అండగా నిలవడంతోనే... సాగు చట్టాలపై కేంద్రం వెనక్కి