Harish Rao At Siddipet : మహారాష్ట్ర రైతులు తెలంగాణ సరిహద్దులో భూములు కొనుగోలు చేసి అక్కణ్నుంచి సాగునీటిని మహారాష్ట్రలోని తమ భూములకు తరలిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ ఉండటం వల్ల వాళ్లు మన రాష్ట్రంలో భూములు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా ఎన్సాన్‌పల్లిలో పర్యటించిన మంత్రి హరీశ్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Harish Rao About Maharashtra Farmers : కాంగ్రెస్, భాజపా నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ మండిపడ్డారు. ఇటీవలే ఓ కాంగ్రెస్ నేత.. కాళేశ్వరం ద్వారా ఒక్క గుంట పొలం కూడా తడవలేదని మాట్లాడారని.. ఆ నాయకుడు ఒకసారి ఎన్సాన్పల్లికి వెళ్లి అక్కడి పంటలను చూడాలని సూచించారు. కాళేశ్వరం జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా అలరారుతోందని తెలిపారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ఎన్నో ప్రయోజనకర కార్యక్రమాలు చేపట్టారని వెల్లడించారు.
"నేను నిర్మల్ జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడి ఓ ఆస్పత్రిని పరిశీలించడానికి వెళ్లాను. ఆ ఆస్పత్రి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం వద్ద ఉంది. నేను ఆ బార్డర్ వెంట నడుస్తున్నప్పుడు నాకు.. తెలంగాణ నుంచి మహారాష్ట్ర వైపు పైపులు చాపి ఉండటం గమనించాను. వెంటనే ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని అడిగాను. మన పొలాల నుంచి నీళ్లు తీసుకుంటున్నారు ఏంటి? మీరంతా ఏం చేస్తున్నారని? అప్పుడు విఠల్ రెడ్డి ఏమన్నారంటే.. మహారాష్ట్రలోని కొందరు రైతులు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి.. ఇక్కడి భూముల్లో బోరువేసి.. ఈ నీళ్లను మహారాష్ట్రలోని తమ భూముల్లోకి తరలిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా ఉంటుంది. మహారాష్ట్రలో కేవలం 8 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా ఉంటుంది. అందుకే అక్కడి రైతులు మన వద్ద భూములు కొని మన కరెంట్‌ను, నీటిని వాడుకుంటున్నారు. ఈ ఉదాహరణ చాలు.. దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది అనడానికి."
- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి