భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ అడుగుజాడల్లోనే నడుచుకుంటూ.. తెలంగాణను అభివృద్ధి పథంలో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అంబేడ్కర్ 130వ జయంతోత్సవాలను అధికారికంగా సంబురంగా జరుపుకుంటున్నామని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని ధర్మారెడ్డి పల్లిలో అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. అందరికీ సమానమైన ఓటు హక్కును కల్పించి.. రాజ్యాంగాన్ని రచించిన మహానీయుడు అంబేడ్కర్ అని హరీశ్ అన్నారు.
విభిన్న జాతులు, వర్గాల అభివృద్ధికి మూడంచెల వ్యవస్థను రూపకల్పన చేశారని కొనియాడారు. స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇలా ఒక మంచి ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేశారని వెల్లడించారు.
దళిత్ ఎంపవర్మెంట్..
అంబేడ్కర్ బాటలో సీఎం కేసీఆర్ పయనిస్తూ.. ఎస్సీ, ఎస్టీలకు 'దళిత్ ఎంపవర్మెంట్' కింద బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించామని హరీశ్ తెలిపారు. దళిత నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
అభివృద్ధిపథంలో..
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై రూ.130 కోట్ల రూపాయలతో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. నిరంతరం సమసమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదని.. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారని గుర్తుచేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన: కోదండరాం