వానా కాలం వస్తే ఉసిల్లు వస్తాయి.. ఎన్నికలు వస్తే కాంగ్రెస్ నాయకులు వస్తారని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఎప్పుడూ కనిపించని నాయకులు ఇప్పుడు కార్లు వేసుకుని ఊరూరా తిరుగుతున్నారని విమర్శించారు. ఎన్నికలు అయిపోతే మళ్లీ ఎవరూ కనిపించరని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనోహర్ రావు, నర్సింహారెడ్డి తెరాసలో చేరారు. హరీశ్ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటికి తాగునీరు అందించాం..
దుబ్బాక నియోజక వర్గంలో తెరాస ప్రభుత్వం మూడేళ్లలోనే మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించిందని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బోరింగు కొట్టి కొట్టి.. అక్కా చెల్లెళ్లకు చేతులు నొప్పి పెట్టాయన్నారు. తెరాస ప్రభుత్వం స్వచ్ఛమైన తాగు నీరు అందించి నల్ల తిప్పగానే నీరు వచ్చే విధంగా చేసిందన్నారు.
ఏడు లక్షల మందికి కల్యాణ లక్ష్మి పథకం..
ఇప్పటికి రాష్ట్రంలో ఏడు లక్షల మంది కల్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ. లక్ష నూట పదహారు అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం వచ్చాక రైతులకు 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు పథకం.. బీడీ కార్మికులకు రూ. రెండు వేల భృతి ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: దుబ్బాక నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం: హరీశ్ రావు