తెలంగాణ మొత్తం ఇప్పుడు దుబ్బాక వైపు చూస్తోందని... ఇటు వైపు ఎప్పుడూ కనిపించని మనుషులు నాయకులు ఈరోజు కనిపిస్తున్నారని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని రెడ్డి సంఘం భవనంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో తెరాసకు సంఘీభావ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సుజాతకు తోబుట్టువులా ఉంటానని మంత్రి అన్నారు. సోదరుడిలా సహకరిస్తానని తానంటే ఆమె అసమర్థురాలు అని విపక్షాలు అనడం ఎంతవరకు సమంజసమన్నారు. మహిళల పట్ల ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఉన్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన ఉత్తమ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.
దుబ్బాకలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మహిళలకు సమాధానం చెప్పకపోతే... కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు బుద్ధి చెబుతారన్నారు. ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు ఏం మంచి చేశాయో చెప్పారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులు ఎన్నికల అనంతరం ఎవరూ కనిపించరన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీరు అందజేసిన ఘనత సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి దక్కుతుందని అన్నారు. రానున్న రోజుల్లో ఆటో కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్, భాజపాలు రెండూ రెండే.. రైతులకు మేలు జరగదు: హరీశ్ రావు