సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. మంత్రికి గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. సేవాలాల్ మహారాజ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి... ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముగిసిన వెంటనే..
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే హుస్నాబాద్‌లో 2 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో బంజారా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి... ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలను కేటాయిస్తోందని పేర్కొన్నారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తా..
హుస్నాబాద్ ప్రాంతంలో గిరిజనులు అధికంగా ఉన్నారని, రానున్న రోజుల్లో ఈ ప్రాంత గిరిజనులకు పాడి పశువులను అందిస్తామన్నారు. ఎన్నికలకు ముందు తెరాస గిరిజనులకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచే... ఎజెండాలోని అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి.. త్వరగా పరిష్కారమయ్యేలా కృషి చేస్తామన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం త్వరలో ప్రత్యేక నిధులు కేటాయించే ఆలోచన ముఖ్యమంత్రి దృష్టిలో ఉందన్నారు.
ఇదీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడు: నిరంజన్‌రెడ్డి