దుబ్బాక ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారు.. గెలుపే లక్ష్యంగా ప్రచారాలు నిర్వహించారు. ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. విమర్శలు.. ప్రతి విమర్శలు.. సవాళ్లతో ఊదరగొట్టారు. త్రిముఖ పోరులో ప్రతి ఓటరు కీలకం కావడం వల్ల... ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు తీవ్ర కృషి చేశాయి. ఫలితంగా భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. 1,98,756 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 1,64,192 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 86.24 శాతం నమోదు కాగా.. ఈసారి 82.61 శాతం పోలైంది. గతం కంటే మూడున్నర శాతం తగ్గినప్పటికీ.. ఉప ఎన్నికల్లో ఈ స్థాయిలో జరగడం విశేషమే.
'పథకాలే కారుకు పెట్రోలు...'
ఉప ఎన్నిక పోరులో ప్రధానంగా భాజపా- తెరాస ఒకరినోకరు టార్గెట్ చేసుకోని ప్రచారం నిర్వహించారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు ఓట్ల వర్షం కురింపిచాయన్న అంచనాలో తెరాస శ్రేణులు ఉన్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, పెన్షనర్లు, బీడీ కార్మికుల ఓట్లతో గెలుపు తమకు నల్లేరుపై నడకే అన్న ధీమాలో ఉన్నారు. భారీ మెజార్టీతో గెలుస్తామన్న ఆశాభావంలో గులాబీ శ్రేణులు ఉన్నాయి. కనీసం 30వేల నుంచి 40వేల మెజార్టీతోనైనా గెలుస్తామన్న విశ్వాసంతో ఉన్నారు.
'యువత మద్దతు మాకే...'
యువత, విద్యావంతులు, చేనేత కార్మికుల మద్దతు తమకే దక్కిందని.. దీనికితోడు కేంద్రం ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న సానుకూలత తమను గెలిపిస్తుందన్న ఆశాభావంలో భాజపా ఉంది. స్వల్ప మెజార్టీతోనైనా ఈసారి తాము గెలుస్తామన్న ధీమాలో కాషాయ శ్రేణులున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి... మాజీ మంత్రి ముత్యంరెడ్డిపై ఉన్న అభిమానం తమను గెలిపిస్తుందన్న అంచనాలో హస్తం పార్టీ నాయకులు ఉన్నారు.
ఎవరి అంచనాలు ఏమేరకు నిజమోతాయో.. ఓటరు ఎవరి వైపు మొగ్గు చూపాడో అన్న విషయం పదో తరీఖున తేలనుంది. అప్పటివరకు వేచి చూడాల్సిందే మరి...