ఆదివారం రాత్రి నుంచి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు(RAINS) కురుస్తున్నాయి. జిల్లాలో పలు చోట్ల 12 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. జిల్లాలోని వందల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. కొండపాక మండలం ఆరేపల్లి విద్యుత్ ఉపకేంద్రంలోకి వరదనీరు చేరింది.
ప్రవాహంలో చిక్కుకున్న లారీ
కోహెడ మండలం బస్వాపూర్ గ్రామం వద్ద మోయ తుమ్మెదవాగు మరోసారి పొంగుతోంది. సిద్దిపేట- హనుమకొండ ప్రధాన రహదారి వంతెన పైనుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో హుస్నాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ ప్రవాహంలో చిక్కుకుంది. గమనించిన స్థానికులు డ్రైవర్‌ను రక్షించారు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరగా.. పంట పొలాలు నీట మునిగిపోయాయి.
మరమ్మతులు చేస్తుండగానే
అక్కన్నపేట మండలం గౌరవెల్లిలోని పాత చెరువుకు గండి పడింది. చెరువుకు సమీపంలోని ఇళ్లు, పంట పొలాలు నీట మునిగాయి. చెరువు నీరు గౌరవెల్లి రహదారి పైనుంచి ప్రవహిస్తుండగా.. రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజుల క్రితమే చెరువు కట్టకు గండి పడింది. చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు.. మరమ్మతులు చేస్తుండగానే రాత్రి కట్ట తెగిపోయింది. భారీ వర్షాలకు మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ప్రజల ఇక్కట్లు
సిద్దిపేట నియోజకవర్గంలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. సిద్దిపేట పట్టణం, నారాయణరావుపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో చెరువులు నిండి మత్తడిపోస్తున్నాయి. నంగునూరు మండలం సిద్దన్నపేట, అక్కెనపల్లి గ్రామాల్లో మత్తడి నిండి నీరు ప్రవహించి రోడ్లపైకి వస్తుండగా వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి: AGRI HUB: అగ్రిహబ్కు శ్రీకారం.. వ్యవసాయ ఆవిష్కరణలకు ప్రోత్సాహం