వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి... తద్వారా రైతులకు ఆదాయం సమకూర్చాలని ప్రభుత్వం భావించింది. పశుపోషణ సులభతరంగా ఉండేలా రాష్ట్రంలోనే తొలిసారిగా... సిద్దిపేట జిల్లా పొన్నాలలో రెండు కోట్ల రూపాయలతో పశువుల వసతి గృహాన్ని ఏర్పాటు చేసింది. పశువుల కోసం షెడ్లు, నీటి తొట్టిలు, గడ్డి కోసే యంత్రాలు, పాలు నిల్వ చేసే గది, పశువుల వైద్యం కోసం పరీక్ష స్టాండ్ తదితర సౌకర్యాల్ని అధికారులు అందుబాటులో ఉంచారు. ఒక్కో వసతి గృహంలో 160 పశువులకు వసతి కల్పించి... పాడి పరిశ్రమ అభివృద్ధి చేయాలని భావించారు. ఎస్సీ కార్పొరేషన్, స్త్రీనిధి రుణాల ద్వారా మహిళలకు గేదెలు, ఆవులు అందించనున్నారు. ప్రస్తుతం వసతి గృహంలో ఉన్న 57 గేదెల ద్వారా రోజుకు 150 లీటర్ల పాలను విక్రయిస్తూ రైతులు లబ్ధిపొందుతున్నారు.
పశువుల హాస్టళ్ల నిర్వహణను రైతులు, మహిళా సంఘాలు తీసుకున్నాయి. మేతవేయడం, పాలు పితకడం, పరిశుభ్రత వంటి పనులను రైతులే చూసుకుంటారు. అధికారులు 20 మంది సభ్యులతో గోపాలమిత్ర పాల ఉత్పత్తి సహకార సంఘం ఏర్పాటు చేశారు. ఈ వసతి గృహాన్ని రేపు మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. సిద్దిపేట జిల్లాలోని ఇర్కొడు, నర్మెట, మిట్టపల్లి, గుర్రాలగొంది, ఇబ్రహీంపూర్, జక్కాపూర్, గల్లమల్యాల గ్రామాల్లోనూ పశువుల వసతి గృహాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం ఉపాధిహామీ, సీఎస్సార్ ద్వారా 2 కోట్ల నిధులు సేకరించారు.