రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గ్రామాలు, పట్టణాలు, వరదలో చిక్కుకుంటున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో....శిథిలావస్థకు చేరిన ఇళ్లను అధికారులు గుర్తించి కూల్చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పురపాలిక పరిధిలో 54 ఇళ్లను అధికారులు గుర్తించి వారికి నోటీసులు అందించారు. హైదరాబాద్‌లో వర్షాలతో ఎదురవుతున్న ఇబ్బందులను జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు తొలగిస్తున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పరికరాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్నారు. వరదల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని....తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి వరద బాధితులకు తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు.
నీట మునిగిన పంటలు
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లిలో గౌరవెల్లి కెనాల్‌కు గండి పడింది. దిగువన ఉన్న పంట పొలాల్లోకి నీరు చేరుతుండడంతో నీట మునిగింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సీతారాంపూర్‌లో రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. నవాబుపేటలో వర్షాలకు కూలిన ఇళ్లను పరిశీలించారు. చెరువులు తెగిపోయి రైతులు పంట పొలాలు నష్టపోతున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి నిర్మల్ జిల్లాలో జలకళ సంతరించుకుంది. సారంగపూర్ మండలంలోని స్వర్ణ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి జలాశయంలోకి వరద నీరు రావడంతో అధికారులు రెండు వరద గేట్ల ద్వారా దిగువకు నీటిని వదిలారు. సిద్దాపూర్ వద్ద వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మూసీనది పరవళ్లు
భువనగిరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కుంటలు, చెరువులు నిండుకుండలా మారాయి. పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ మండలాల గుండా ప్రవహించే మూసీ నది పరవళ్లు తొక్కుతుంది. రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం చెరువు, వలిగొండ చెరువు పూర్తిగా నిండాయి. పోచంపల్లిలో 11 ఇళ్లు, వలిగొండ మండలంలో 7 ఇళ్లు నేలకూలాయి. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిలో కుడుముల వాగు పొంగి పొర్లుతుంది. వ్యవసాయ పనుల కోసం వెళ్లి వాగులో చిక్కుకున్న వారిని తాడు సాయంతో స్థానికులు రక్షించారు. అసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలో వర్షం ధాటికి ఇల్లు కూలీ ఓ వృద్ధురాలు మృతిచెందింది.
ఒకకంట ఆనందం... మరో కంట విషాదం
గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్లలో పుట్టిలో నది దాటుతుండగా... ఓ యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, వాగులు నీటితో జలకళలాడుతున్నాయి. చెరువులు అలుగు పోస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్లలో ఓ వృద్ధురాలి ఇంట్లోకి నీరు చేరడంతో... ఇబ్బంది పడుతోంది. వస్తువులన్నీ మునిగిపోవడంతో వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురు చూస్తోంది. తనను ఎవరైనా ఆదుకోవాలని వృద్ధురాలు విజ్ఞప్తి చేసింది.
ఇదీ చూడండి : 'మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మహానగరం'