Harish Rao on Wet Paddy Procurement : మామూలు వరిధాన్యానికి చెల్లించిన ధరనే.. తడిచిన ధాన్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు రైతులకు హామీ ఇచ్చారు. సిద్ధిపేట ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సివిల్ సప్లయ్ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. మంత్రి హరీశ్ రావుకు అక్కడి మహిళా రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. వడగండ్ల వానతో తమ ధాన్యమంతా నీటిపాలైందని.. తమ కష్టమంతా కొట్టుకుపోయిందని వాపోయారు.
Harish Rao at Siddipet Market Yard : అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందవద్దని హరీశ్ రావు ధైర్యం చెప్పారు. తడిసిన ధాన్యాన్ని గింజ కూడా మిగలకుండా సేకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతు కుటుంబాలకు భరోసానిచ్చారని స్పష్టం చేశారు. 'మీ గోస చూసి నాకు బాధ అయింది.. అందుకే దగ్గరుండి మరి చెప్పి పోదామని వచ్చినా.. మీకు నేనున్నా.. కేసీఆర్ సార్ ఉన్నడు' అని రైతులకు హరీశ్ రావు భరోసా కల్పించారు.
రైతన్నలను ఆత్మీయంగా పలుకరిస్తూ.. అక్కడి ఉన్నవారికి భరోసానిచ్చారు మంత్రి. దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా.. రాష్ట్రంలోని సీఎం కేసీఆర్ రైతుల కోసం ఆలోచన చేస్తున్నారని చెప్పారు. ఈ దేశంలో రైతుల గురించి ఆలోచించే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. తడిసిన ధాన్యాన్ని కొనమని వ్యవసాయ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలియజేశారు.
యాసంగి పంటను మార్చిలో కోతలకు రైతులకు అవగాహన కల్పిస్తాం: గతంలో కంటే భిన్నంగా రాష్ట్రంలో అకాల వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయని మంత్రి అన్నారు. భవిష్యత్తులో యాసంగి కోతలు మార్చి నెల లోపే జరిగే విధంగా.. ఎటువంటి విధానాలను అవలంభించాలో అధ్యయనం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఆ దిశగా రైతులను చైతన్యం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని రైతు వేదికల్లో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో సమావేశాలు నిర్వహించి తగిన అవగాహన కల్పిస్తామని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం కింద రూ. 10వేలు ఇస్తామని.. రైతులు అందరూ పంటల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.
ఇవీ చదవండి :