Harish Rao Comments On Central Government : సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నలుగురు మంత్రుల పర్యటన వేళ.. బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. దుబ్బాకలో ఆర్టీసీ బస్టాండ్ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, అజయ్‌కుమార్, ప్రశాంత్‌రెడ్డి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్‌రావు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.
బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు: ఈ సమయంలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలుత హబ్సిపూర్‌లో గోదాములను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి మంత్రులు ప్రారంభించారు. ఈ సమయంలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేయడం ఇరుపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీయడంతో.. హరీశ్‌రావు, రఘునందన్ రావు వారిని వారించారు.
అనంతరం దుబ్బాక బస్టాండ్ వద్దకు బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన పోలీసులు.. బస్టాండ్ ప్రాంతంలో దుకాణాలు మూసివేయించారు. రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా పెద్దఎత్తున నినాదాలతో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులను తోసుకొని బస్టాండ్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా.. మంత్రులు లోపలికి వెళ్లేందుకు కొంత ఇబ్బందిపడ్డారు.
గోవు, గోపురాన్ని రాజకీయాలకు వాడుకున్న చరిత్ర బీజేపీది: బీఆర్‌ఎస్ నాయకుల ఫ్లెక్సీని.. బీజేపీ కార్యకర్తలు చింపివేయగా కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలను పోలీసులు బస్టాండ్‌కు కొంతదూరం వరకు చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రారంభోత్సవాల అనంతరం మంత్రులు.. దుబ్బాక మార్కెట్ కమిటీ పాలకవర్గం అభినందన సభలో పాల్గొన్నారు. గోవు, గోపురాన్ని రాజకీయాలకు వాడుకున్న చరిత్ర బీజేపీకే సొంతమని మంత్రులు విమర్శించారు. బీజేపీ మిషన్-90 కాదని.. 90 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు దొరకరని వారు ఎద్దేవా చేశారు. పోతారంలో రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రులు.. దుబ్బాకలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
"గోవు, గుడిని రాజకీయాలకు వాడుకుని మలినం చేసిన చరిత్ర బీజేపీది. కానీ మీలాగా రాజకీయాలకు మేము వాడుకోము. ఓట్ల కోసం బీజేపీ వాళ్లు ఏమైనా చేస్తారు. బీజేపీది చేరికల కమిటీ కాదు.. పార్టీల చీలికల కమిటీ. తెలంగాణకు, దేశానికి ఏం చేశారో చెప్పాలి. అధికారంలోకి రాగానే తెలంగాణలోని 7 మండలాలను లాక్కున్నారు." - హరీశ్‌రావు, మంత్రి
ఇవీ చదవండి:కేసీఆర్ హఠావో... తెలంగాణ బచావో: ఎంపీ లక్ష్మణ్
ఆమెకు '18'.. అతడికి '20'.. ఇంట్లోంచి పారిపోయి పెళ్లి.. పోలీసుల ఎంట్రీతో..