న్యాయమైన హక్కుల కోసం పోరాడితే స్వార్థపూరితంగా కేసులు నమోదు చేసి అతిపెద్ద నేరం చేసిన వారిలా సంకెళ్లు వేయడం ఆవేదనకు గురి చేసిందని గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు అన్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న గుడాటిపల్లి భూ నిర్వాసితులకు, తెరాస కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. పోలీసు అధికారులపై దాడి జరగడంతో కేసులు నమోదు చేశారు.
నలుగురు భూనిర్వాసితులను కరీంనగర్ జైలు నుంచి హుస్నాబాద్ మున్సిఫ్ కోర్టుకు సంకెళ్లు వేసి తీసుకొచ్చి గురువారం హాజరు పరిచారు. నలుగురికి మరో పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు. వీరి కుటుంబసభ్యులు, గ్రామస్థులు కోర్టు వద్దకు చేరుకుని ఆవేదనకు గురై రోదించారు. పోలీసులు కోర్టులో పత్రాలు దాఖలు చేయడంలో జాప్యం వల్ల తమవారికి బెయిల్ రావడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.