లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తోన్న వలస కార్మికులు, యాచకులు, కూరగాయలు విక్రయించే అన్నదాతలకు భోజన సదుపాయాలు కల్పించాలని ఆర్థిక మంత్రి హరీశ్ రాపు సూచించారు. దీన్ని అందిపుచ్చుకున్న సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి నేనున్నా.. అంటూ వారి ఆకలి తీరుస్తోంది. రెండు రోజులుగా సిద్దిపేట తాత్కాలిక రైతు బజార్లలో దాదాపు 200 మంది అన్నదాతలకు అన్నం ప్యాకెట్లు అందజేశారు. మైత్రివనంలో 30 మంది భవన నిర్మాణ కార్మికులకు ఇదే తరహా సేవలు అందిస్తున్నారు. ఇతర జిల్లాలకు కాలినడకన వెళ్తున్న 30 మందికి సిద్దిపేటలో భోజనం పెట్టారు. పట్టణంలోని యాచకుల ఆకలి తీరుస్తున్నారు.
నిత్యం 300 మందికి భోజనం పెడుతుండటం గమనార్హం. మున్ముందు నిత్యం 500 మందికి భోజనం అందించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమితి ప్రతినిధులు నేతి కైలాసం, గ్యాదరి పరమేశ్వర్, నల్ల నాగరాజం, కుమ్మరికుంట రమేశ్, శ్రీను, సంకీర్త్ తెలిపారు. పుల్లూరు, కొమురవెల్లిలో వివిధ రంగాల్లోని దాదాపు 50 మంది ఇతర రాష్ట్రాల కార్మికులు చిక్కుకుపోగా, కొంత మేర ఆర్థిక సహాయం అందజేశారు.
సిద్దిపేటలోని బాంబే క్లాత్ షోరూం నిర్వాహకులు తాత్కాలిక రైతు బజార్లలోని రైతులకు ఆదివారం పులిహోర అందించారు. ఈ ఆపత్కాలంలో అన్నార్తులకు అండగా ఉండటం మాధవ సేవతో సమానం. ఈ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు.
ఇదీ చూడండి: తల్లి పాల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందా?