సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకి రూ.2500 మద్దతు ధర ప్రకటించి... కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. రైతు ఐక్యతా సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో రైతులు ఆందోళనకు దిగారు. కిలోమీటర్ పరిధిలో వాహనాలు నిలిచిపోవడంతో... పోలీసులు, స్థానిక తహసీల్దార్ వచ్చి రైతులకు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు.
రాష్ట్ర ప్రభుత్వ సూచనతో 60 శాతం సన్నరకం వరిని పండించామని రైతులు తెలిపారు. ఎకరానికి రూ.5వేలు అదనపు పెట్టుబడి పెట్టామన్నారు. దొడ్డు రకం వరి ధాన్యం ఎకరానికి 32 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే, సన్న రకం ధాన్యం ఎకరానికి 16 క్వింటాళ్ల పంట మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సూచనతో సన్నాలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయారని రైతు సంఘం నాయకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి రూ.2,500 కనీస మద్దతు ధరను చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రైతులు ఆ అలవాటును మార్చుకోవాలి: మంత్రి ఈటల