మంత్రి హరీశ్‌రావుపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈటల సిద్దిపేటలోని రంగదాంపల్లి చౌరస్తాలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈటలకు చౌరస్తా సిద్దిపేట భాజపా శ్రేణులు, ముదిరాజ్ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు.
కర్రుకాల్చి వాత పెట్టిండ్రు..
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో తెరాస చేసిన కుట్రలు చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుందని ఈటల మండిపడ్డారు. రూ. 500 కోట్లు పంపిణీ చేశారని ఆరోపించారు. భాజపాకు ఓటు వేస్తే పింఛన్ పోతుందని, సంక్షేమ పథకాలు రావని, రేషన్ కార్డు పోతుందంటూ జనాలను భయపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ ప్రజలు ప్రగతిభవన్‌లో కూర్చున్న కేసీఆర్‌కు, సిద్దిపేటలో కూర్చొని కుట్రలు చేసిన హరీశ్‌రావుకు కర్రు కాల్చి వాత పెట్టారన్నారు.
రోజులు దగ్గరపడ్డాయి..
"తెలంగాణ కోసం సిద్దిపేట పిడికిలెత్తి నిలబడింది. ఆ నినాదాన్ని తెలంగాణ సమాజం అంతా అందిపుచ్చుకుని తెలంగాణ తెచ్చుకున్నాం. సిద్దిపేట ప్రజలు హరీశ్‌రావును గెలిపిస్తే.. ఆయన ఈరోజు అధర్మం పక్షాన, అన్యాయం వైపున, దౌర్జన్యం పక్కన నిలబడ్డాడు. హరీశ్‌రావు ఎన్ని కుట్రలు, డబ్బు, మద్యాన్ని, దాబాయింపులను నమ్ముకున్నాడో వాటికే బలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వీళ్లకు అధికారం అప్పగించింది అభివృద్ధి చేయడానికి, ప్రజలను సల్లగా చూడటానికి. కానీ.. దౌర్జన్యం చేయడానికి, దుర్మార్గం చేయడానికి, ప్రజల గొంతుకలను నొక్కడానికి కాదు. నన్ను ఓడించేందుకు నా నియోజకవర్గంలో దళితబందు అమలు చేశారు. అదే దళితబందును సిద్దిపేటలో, గజ్వేల్‌తో పాటు తెలంగాణ అంతటా అమలు చేయాలి. సిద్దిపేటలో కూడా దళిత గర్జన పెట్టే రోజు వస్తుంది. దానికి నేనే నాయకత్వం వహిస్తా." - ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే.
ఇదీ చూడండి: