Lovers Commit Suicide In Medak : వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి బతకాలనుకున్నారు. కానీ వారి ప్రేమకు తల్లిదండ్రులు అడ్డు చెప్పటంతో ఇద్దరూ కలసి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం : నిజాంపేట్‌కు చెందిన కర్పె ఉదయ్ కుమార్ (21) మిర్చి వ్యాపారం చేస్తున్నాడు. 3 నెలల క్రితం అతడి తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన రోహిత (20) నారాయణఖేడ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో గ్రామస్థుల సమక్షంలో ఇద్దరికీ సర్దిచెప్పారు. ఇద్దరి తల్లిదండ్రులు వాళ్ల ప్రేమను నిరాకరించడంతో మనస్తాపం చెందారు.
ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య : దీంతో నిజాంపేట నుంచి 90 కిలోమీటర్ల దూరంలోని మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి శివారులోని హరిత రిసార్ట్‌కు వెళ్లారు. అక్కడ ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న పసుపు, కుంకుమతో స్థానిక ఆచారం ప్రకారం బొట్టు పెట్టుకొని పెళ్లి చేసుకున్నారు. ఆ ఆనంద క్షణమే వారికి చివరి క్షణమైంది. పెళ్లితో ఒక్కటైన మరుక్షణమే, అదే గదిలోని ఫ్యాన్‌కు ఇద్దరూ ఒకే తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కిటికీలు బద్దలు కొట్టి చూసేసరికి : శుక్రవారం సమయం దాటినా గదిని ఖాళీ చేయకపోవడంతో రెస్టారెంట్ సిబ్బంది తలుపులు తట్టారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిటికీలు బద్దలు కొట్టి చూసేసరికి ఇద్దరూ ఉరివేసుకొని ఉన్నారు. గదిని బుక్ చేసిన ఆధారాల మేరకు ఇరువురి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఇరు కుటుంబీకుల సమక్షంలో గదిని తెరిచారు. మృతదేహాలను సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. రెస్టారెంటు మేనేజర్ సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మిస్సింగ్ కేసు : ఉదయ్ కుమార్, రోహిత కనిపించడం లేదని గురువారం ఉదయం రోహిత తండ్రి ఎం.దుర్గేష్, అదే రోజు మధ్యాహ్నం ఉదయ్ కుమార్ తల్లి బైరమ్మ నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అపార్ట్మెంట్ పైనుంచి దూకి బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య - పని ఒత్తిడి భరించలేకే!
'తాతయ్య గుర్తుకొస్తున్నాడు వెళ్లిపోతున్నా' - ఓ మనవడి బలన్మరణం