సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిపో క్రాస్ రోడ్ సమీపంలోని సిద్దిపేట-వరంగల్ ప్రధాన రహదారి పక్కన విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి. మరికొన్ని పూర్తిగా కింద పడిపోయి ప్రమాదకరంగా మారాయి. మూడ్రోజుల క్రితం హుస్నాబాద్‌లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాలు వంగి రహదారిపైకి చొచ్చుకొని వచ్చాయి. కింద పడిన విద్యుత్ స్తంభాల ద్వారా విద్యుత్ సరఫరా అయితే అటువైపు వెళ్లేవారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
విద్యుత్ అధికారులకు సమాచారమందించి రెండ్రోజులైనా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే స్తంభాలను సరిచేసి ప్రమాదం జరగకుండా చూడాలని కోరుతున్నారు.