దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తమ సంతాపం ప్రకటించారు. శాసన సభ్యుడు, సహచర తెలంగాణ ఉద్యమకారుడు రామలింగారెడ్డి అకాలమరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.
బాధ్యత ఉన్న నాయకుడు...
సోలిపేట మృతి పట్ల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. నాలుగు సార్లు సహచర ఎమ్యెల్యేగా పని చేసిన రామలింగారెడ్డి ప్రజా సమస్యల పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి అని, సమాజం పట్ల బాధ్యతగా ఉన్న నాయకుడని భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. ప్రజా ఉద్యమ నేతగా, జర్నలిస్టుగా, ఎమ్యెల్యేగా చాలా చురుకైన పాత్ర పోషించిన నాయకుడు రామలింగారెడ్డి అన్నారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటన్నారు.
ఆత్మకు శాంతి చేకూరాలి..
రామలింగారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక శాసనసభ సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి గారి మరణం బాధాకరం.. వరుసగా నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికై రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న రామలింగారెడ్డి మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
ఉమ్మడి జిల్లాకు తీరని లోటు...
మిత్రుడు, సోదరుడు, సహచర ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి తనను ఎంతగానో కలిచివేసిందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్ట్ గా, ఎమ్మెల్యేగా ఎల్లప్పుడూ అట్టడుగు వర్గాల పక్షాన నిలబడ్డ రామలింగారెడ్డి మృతి ఉమ్మడి మెదక్ జిల్లాకు తీరని లోటని ఆయన తెలిపారు. ఆయన అభిమానులకు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.