సిద్దిపేట జిల్లా తొగుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మాగౌడ్తో పాటు వంద మంది కాంగ్రెస్, భాజపా నుంచి తెరాసలో చేరారు. మంత్రి హరీష్ రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువత పెద్ద ఎత్తున తెరాసలో చేరుతోందని మంత్రి హరీష్ అన్నారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు ఆలస్యం అవడానికి కారణం కాంగ్రెస్ నాయకులేనని మంత్రి ఆరోపించారు. తెరాస పార్టీకి విశ్వాసం, విశ్వతనీయత ఉందన్నారు.
కొండపోచమ్మ, రంగనాయక సాగర్ భూనిర్వాసితులకు పరిహారం ఎలా అందిందో... అదే విధంగా మల్లన్నసాగర్ బాధితులకు కూడా ఇస్తామన్నారు. తొగుట నుంచి తెరాస అధిక మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు కరెంటు ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వద్దని కోర్టులో కేసులు వేసినందుకు అడుగుతారా?.. అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఉపఎన్నికల అన్నింటిలో తెరాసే విజయం సాధించిందని... ఈ ఎన్నికల్లో కూడా గెలుపు గులాబీ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. భాజపా గోబెల్స్ ప్రచారానికి అడ్డు అదుపు లేకుండా పోతోందన్నారు. తొగుట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామన్నారు. సోలిపేట సుజాతను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: 'ప్రతి ఎమ్మెల్యే అక్కడే ఉండాలి... సహాయక చర్యలు పర్యవేక్షించాలి'