త్వరలో అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీలో అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీకి వైద్యారోగ్యశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. వాక్సిన్ స్టోరేజీ, పంపిణీకి సంబంధించిన కార్యాచరణ ముందే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
వైద్య సిబ్బందికే తొలి ప్రాధాన్యం...
తొలి విడతలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తామని పాలనాధికారి స్పష్టం చేశారు. రెండో విడతలో పోలీస్‌శాఖ, పారిశుద్ధ్య, అంగన్వాడీ సిబ్బందికి... మూడో దశలో 50 సంవత్సరాలు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించిందని తెలిపారు.
యూట్యూబ్‌లో ప్రచారం చేయండి...
వ్యాక్సిన్ పంపిణీ సజావుగా జరిగేలా డివిజన్, మండల , గ్రామస్థాయిలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. వాక్సిన్‌పై అపోహాలు తొలగించేలా నగరాల్లోను, గ్రామాల్లోను విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. సిద్దిపేట విద్యామిత్ర యూట్యూబ్ ఛానెల్ ద్వారా కోవిడ్ వాక్సినేషన్ ప్రోగ్రామ్, ప్రాధాన్యత క్రమంలో వాక్సినేషన్ పంపిణీపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి... వారిని చైతన్యవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.