Mallanna Sagar Project: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన భారీ రిజర్వాయర్ మల్లన్నసాగర్‌లోకి అధికారికంగా నీటి విడుదలకు రంగం సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యధిక ఆయకట్టుకు సరఫరాతోపాటు తాగు, పారిశ్రామిక అవసరాలకు ఇచ్చే నీటికి ఈ రిజర్వాయర్ కీలకం కానుంది. భారీ మట్టికట్టతో.. 50 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ నిర్మించారు. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతలలో భాగంగా 1.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణాన్ని తొలుత ప్రతిపాదించారు. పునరాకృతిలో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా మారిన తర్వాత మల్లన్నసాగర్ సామర్థ్యాన్ని 50 టీఎంసీలకు పెంచారు. ఈ రిజర్వాయర్ కింద లక్షా 65 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్లకు కూడా దీని ద్వారానే నీటిని పంపుతారు. కొత్త ఆయకట్టు 8.33 లక్షల ఎకరాలు ఈ రిజర్వాయర్ కింద, దిగువన ఉండగా.. నిజాంసాగర్; సింగూరు, ఘనపూర్ ఆయకట్టు స్థిరీకరణ కూడా దీనిపైనే ఆధారపడి ఉంది. మొత్తమ్మీద సుమారు 12 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు మల్లన్నసాగర్ దిగువన ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యధికంగా నిర్వాసితులైంది కూడా దీని కిందనే. తక్కువ కాలంలోనే పూర్తి చేసిన ఈ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసే పంపుహౌస్‌లో మోటార్లను ఆన్ చేయడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అధికారికంగా ప్రారంభించనున్నారు.
గత సెప్టెంబరులోనే ప్రయోగాత్మక పరిశీలన
సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్ గ్రామం వద్ద లిప్టు నిర్మించారు. ఒక్కొక్కటి 43 మెగావాట్ల సామర్థ్యంతో ఎనిమిది పంపులను ఏర్పాటు చేశారు. వీటి నుంచి సుమారు 0.85 టీఎంసీ నీటిని రోజూ మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోయనున్నారు. దిగువన రిజర్వాయర్లు, కాలువలకు పూర్తిస్థాయిలో నీటిని ఇవ్వడానికి మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా పనులు పూర్తి చేయాల్సి ఉంది. కనిష్ఠంగా 15 మీటర్ల ఎత్తుతో, గరిష్ఠంగా 60 మీటర్ల ఎత్తుతో 22.6 కి.మీ. దూరం మట్టికట్ట నిర్మాణాన్ని పూర్తి చేశారు. 59 చదరపు కి.మీ. దూరం రిజర్వాయర్‌లో నీటి విస్తరణ ఉంటుంది. గత ఏడాది సెప్టెంబరులో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా 5 టీఎంసీల నీటిని నింపారు. మొదటిసారిగా నీటి నిల్వతో తలెత్తే సమస్యలను పరిశీలించిన తర్వాత మరో 5 టీఎంసీలను నింపారు. ప్రస్తుతం 10.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రయోగాత్మక పరిశీలన పూర్తయిన తర్వాత.. ఇప్పుడు అధికారికంగా మల్లన్నసాగర్‌లోకి ముఖ్యమంత్రి నీటిని విడుదల చేయనున్నారు. భూసేరణ, పునరావాసం ప్రధాన సమస్యలుగా ముందుకొచ్చాయి. వీటన్నింటిని అధిగమించి రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
రిజర్వాయర్ నిర్మాణానికి.. | |
భూమి | 17,872 ఎకరాల సేకరణ |
మట్టి | 14.36 కోట్ల క్యూబిక్ మీటర్లు |
రాయి | 16.37 లక్షల క్యూబిక్ మీటర్లు |
కాంక్రీటు | 3 లక్షల క్యూబిక్ మీటర్లు |
ముంపునకు గురైన గ్రామాలు | పూర్తిగా-8, పాక్షికంగా-4 |