సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమన్నగూడ వద్ద రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. మంచిర్యాల డిపోకు చెందిన బస్సు ఉదయం సికింద్రాబాద్‌కు బయలు దేరింది. గజ్వేల్ మండలం రిమన్నగూడకు రాగానే మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ప్రజ్ఞాపూర్ వైపు మళ్లింది. అదే దారిలో వస్తున్న ఆర్టీసీ బస్సు టిప్పర్ని వెనుకవైపు నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ యూసుఫ్, కండక్టర్ అశోక్ కుమార్‌తోపాటు బస్సులో ప్రయాణిస్తున్న హరీశ్, యశోద, బాల్ నర్సయ్య, ముత్తమ్మ, కందుకూరి అంజయ్య, కందుకూరి రాజేశ్వరి, కందుకూరి విజయ, బి. పద్మలకు గాయాలయ్యాయి. వీరిని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అందులో ముగ్గురిని గాంధీ ఆస్పత్రికి సిఫారసు చేశారు. కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి : 'పాఠశాలల్లో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం'