సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులో డీసీఎం వ్యాన్ లో హుజురాబాద్ నుండి గోవధశాలకు తరలిస్తున్న 11 గోవులను, దూడలను భాజపా నాయకులు అడ్డుకున్నారు. గోవులను ఎక్కడికి తరలిస్తున్నావని డ్రైవర్ని ప్రశ్నించగా డ్రైవర్ సరైన సమాధానం చెప్పలేదు. అనుమానించిన భాజపా నాయకులు వాహనాన్ని హుస్నాబాద్ పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీసీఎంను స్టేషన్కు తరలించారు. హుస్నాబాద్ పట్టణ శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న గోవధశాలపై చర్యలు తీసుకోవాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. డీసీఎంలో ఇరుకు ఇరుకుగా కుక్కి అక్రమంగా తరలిస్తున్న గోవులను, గేదెలను తరలిస్తున్న క్రమంలో చిన్న దూడ చనిపోయిందని భాజపా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గోవధ నిషేధ చట్టాలు చేసినప్పటికీ రైతుల బలహీనతలను ఆసరాగా చేసుకొని కొంతమంది గోవధశాలలు నిర్వహిస్తూ.. రైతుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా గోవులు, పశువులను కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ అంగడిలో నిబంధనలకు విరుద్ధంగా పశువుల అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయని, వెటర్నరీ డాక్టర్ ధ్రువీకరించిన తర్వాతనే గోవులను గోవధశాలకు తరలించాలనే నిబంధన ఉన్నప్పటికీ నిర్వాహకులు పాటించడం లేదని ఆరోపించారు. అక్రమంగా గోవులను గోవధశాలలకు తరలిస్తున్న గోవధశాల నిర్వాహకులపై వ్యతిరేకంగా భాజపా ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని, ప్రతి శుక్రవారం జరిగే హుస్నాబాద్ అంగడిలో పశువుల కొనుగోళ్లు, అమ్మకాలపై పోలీసులు, రెవెన్యూ శాఖ పర్యవేక్షణ చేయాలన్నారు. అధికారులు స్పందించి అక్రమంగా గోవులను తరలిస్తున్న గోవధశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: నాగార్జునసాగర్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు